రామాయంపేట, డిసెంబర్ 30 : పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రజలు స్వచ్ఛత పాటించి, సంపూర్ణ ఆరో గ్యంగా జీవించాలని జిల్లా మలేరియా ఇన్చార్జి అధికారి కుమారస్వామి పేర్కొన్నారు. నీటి నిల్వతోనే దోమలు వృద్ధి చెంది, వ్యాధులు వ్యాప్తిస్తాయన్నారు. బోధకాల బారిన పడకుండా దోమలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామం లో గురువారం రాత్రి ఇంటింటి సర్వే నిర్వహిం చారు. మలేరియా, బోధకాలతో బాధపడుతున్న బాధితులను గుర్తించి, 300 మందికి పైగా రక్త న మూనాలను సేకరించారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బోధకాలు ఎక్కువ శాతం దోమల ద్వారా వస్తాయన్నారు. బోధకాలు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి అక్కన్నపేటలో రాత్రి 7 నుంచి 11 గంటల వరకు సర్వే నిర్వహించి, రక్త నమూనాలను సేకరించారు. సర్వేలో డీ.ధర్మారం పీహెచ్ఎన్ఎం సత్తమ్మ, సూపర్వైజర్ సునంద, హెచ్ఈవో చారి, ఏఎన్ఎంలు నిర్మల, ఎలీషా, రమాదేవి, స్వప్న, ఆశ వర్కర్లు రాణి, లక్ష్మి, పుష్ప, రాధిక, నాగలక్ష్మి, జ్యోతి, శ్రీకాంత్ పాల్గొన్నారు.