రాయపోల్, మే 25 : రాయపోల్ మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో ‘పోచమ్మ పండుగ’కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సర్పంచ్ రొయ్యల సుగుణ తెలిపారు. మే 28 గురువారం నుంచి పండుగ సందడి మొదలవుతుందని ఆమె చెప్పారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తిశ్రద్ధలతో ప్రతి ఏడాది నిర్వహించే ఈ పండుగను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సుగుణ పేర్కొన్నారు.
పండుగ సందర్భంగా గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సిద్ధం చేసి పోచమ్మ తల్లికి సమర్పించనున్నారని సర్పంచ్ తెలిపారు.
పోచమ్మ పండుగను పునర్కరించుకొని గ్రామంలో ప్రత్యేక పూజలు, బోనాల ఊరేగింపులు, డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ కళారూపాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుందని సర్పంచ్ రొయ్యల సుగుణ చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వాహనాల పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ యువకులు, మహిళా సంఘాలు, పెద్దలంతా పండుగను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. సమీప గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికోసం కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సుగుణ తెలిపారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, పంటల సమృద్ధి, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని గ్రామస్తులు ప్రార్థించనున్నట్లు సర్పంచ్ రొయ్యల సుగుణ వెల్లడించారు.