రామాయంపేట, డిసెంబర్ 24 : అర్హులైన రైతులందరూ రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరూ కచ్చితంగా ఆధార్ కార్డుతో ఈ-కేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి రాజ్నారాయణ పేర్కొ న్నారు. వ్యవసాయ కార్యాయలంలో ఏర్పాటు చేసిన ఈ-కేవైసీ కేం ద్రాన్ని శనివారం సందర్శించారు. అనంతరం కోమటిపల్లి, గొల్పర్తి గ్రామాల్లోని పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుబంధు దఖాస్తులను రైతుల నుంచి స్వీకరించారు. అనంతరం ఏవో రాజ్ నారాయణ మాట్లాడుతూ.. రామాయంపేట మండల వ్యాప్తంగా 6851మంది పీఎం కిసాన్ యోజన లబ్ధ్దిదారులు ఉన్నారని, ఇప్పటి వరకు 5621 మంది ఈ-కేవైసీ చేసుకున్నట్లు, 1200 మంది ఈ-కేవైసీ చేసుకోలేదన్నారు. ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ డబ్బులు పడుతాయని, లేకుంటే రావని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కోసం 2022-23కు సంబంధించి మార్గదర్శకాలను ప్రకటించినట్లు తెలిపారు. 2-12-22లోపు పట్టాదార్ పాసుపుస్తకం తీసుకున్న రైతులు రైతుబంధుకు అర్హులన్నారు. మండలవ్యాప్తంగా 476 మంది రైతులు కొత్తగా పాసుబుక్కులు తీసుకున్నారని, వీరందరూ వ్యవసాయ కార్యాలయానికి చేరుకుని తగిన ధ్రువపత్రాలను అందజేయాలని కోరారు. ఆయన వెంట ఏఈవోలు సాయి, రాజు, మీసేవ ఆపరేటర్ అమరేందర్ ఉన్నారు.