Harish Rao | ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పిలుపు నిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త కొంత సమయం కేటాయించి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.
ఈ సారి సాధారణ సభ్యత్వానికి రూ. 10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేపడుతోంది. స్పాట్లో లైవ్ ఫోటో తీసుకోవడంతోపాటు ఓటరు వివరాలు కూడా అక్కడే నమోదవుతాయి. దీని ద్వారా మెంబర్షిప్ డ్రైవ్ అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ పూర్తి చేస్తే.. అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు సాధించేలా..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం ఇప్పటికే 7 స్థానాలు గెలుచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు సాధించేలా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున.. రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిద్దామని చెప్పారు. ఆన్లైన్ నమోదు విధానంపై నాయకులకు, కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈ మెంబర్షిప్ డ్రైవ్ 100 శాతం విజయవంతం కావడానికి స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సమన్వయకర్తలు, మెదక్ జిల్లా మెంబర్షిప్ ఇన్చార్జి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

