సిద్దిపేట కమాన్, మే 2 : బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులకు త్రీవ అన్యాయం చేస్తుందని బీఆర్టీయూ ర్రాష్ట కార్యదర్శి మంచె నర్సింలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో ఇప్పటికే చాలావరకు బీడీ కంపెనీలు మూతపడ్డాయని, మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కంపెనీలు మూతపడడంతో ఎంతోమంది కార్మికుల బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దేశాయ్ బ్రదర్స్ బీడీ కంపెనీ వద్ద బీఆర్టీయూ నాయకులు జెండా ఆవిష్కరించారు.
అనంతరం కార్మికులకు మిఠాయిలు పంచి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పనికిమాలిన నిర్ణయాలతో కార్మికులకు చేతి నిండా పని దొరకడం లేదని ఆరోపించారు. కార్మిక చట్టాల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 20న జాతీయ కార్మిక సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య్రకమంలో బీఆర్టీయూ నాయకులు శోభన్, శ్రీనివాస్, మల్లారెడ్డి, అంబక్క, మైముద బేగం పలువురు పాల్గొన్నారు.