రాయపోల్, మే04 : వడగండ్ల వానతో దౌల్తాబాద్, రాయపోల్ మండల పరిధిలోని అయా గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలరాలింది. ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలకు తరలించి వారం గడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరగడంతో వడగండ్ల వానకు ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
దౌల్తాబాద్ మండలం ఇందుప్రియలో ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా నీళ్లలో నిండిపోయింది.
చాలా గ్రామాల్లో ఐకెపి కేంద్రాల్లో పట్టాలు కప్పినప్పటికీ వడగండ్ల వానతోపాటు ఈదురుగాలి రావడంతో పట్టాలు కొట్టుకపోయి ధాన్యం తడిసిపోయిందని రైతులు దిగాలు చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.