సిద్దిపేట : వాటర్ అవార్డు 2020 కోసం సిద్దిపేట మున్సిపాలిటీ పంపిన దరఖాస్తును పరిశీలించిన కేంద్రం క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు దామోదర్‌రావు, గణేశ్‌కుమార్ సిద్ధిపేటను సందర్శించారు. సిద్దిపేట మున్సిపల్ జాతీయ స్థాయిలో షార్ట్ లిస్టు అయిందని, అందులో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు సిద్దిపేటను సందర్శించారని మున్సిపల్ కమిషనర్ రమణాచారి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని యూజీడీ, నీటి సరఫరా విషయాలను ఆకస్మికంగా పరిశీలించి తెలుసుకున్నారని వెల్లడించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్సప్లై తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందం సభ్యులకు వివరించినట్లు తెలిపారు. అనంతరం బృందం సభ్యులు పట్టణంలోని వాటర్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్, చింతల్‌చెరువు ఎస్టీపీ ట్యాంకు, కోమటి చెరువు, రంగనాయకసాగర్, కమ్మర్లపల్లి, కేసీఆర్‌నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ, స్వచ్ఛబడులను సందర్శించారు. కార్యక్రమంలో డీఈ విబిన్కుమార్, ఏఈలు అన్వేశ్‌రెడ్డి, పృథ్వీ తదితరులు ఉన్నారు.