సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 25 : మహిళలకు అండగా నిలిచేందుకు భరోసా, స్నేహత కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సత్వర న్యాయం చేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని భరోసా,స్నేహిత సెంటర్లను సోమవారం ఆమె సందర్శించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లైంగిక దాడులకు గురైనా బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా పోక్సో, లైంగికదాడుల కేసులు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా సెంటరుకు తీసుకొస్తున్నామన్నారు. తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు అందించాలని సిబ్బందిని ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు అందించి, వారికి ఎవరూ లేనప్పుడు బాలసదనంలో ఆశ్రయం కల్పించాలన్నారు.
లైంగికదాడి, పోక్సో కేసుల్లో బాధితులకు త్వరగా పరిహారం ఇప్పించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఇప్పటి వరకు 198 మంది బాధితులకు భరోసా కల్పించి 72 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భరోసా సెంటర్ ఫండ్ నుంచి 12 మంది బాధితులకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. 2015 నుంచి ఇప్పటి వరకు 185 మంది మహిళలకు 65,45,000 రూపాయలను పరిహారం రూపంలో తెలంగాణ ప్రభుత్వం అందించిందన్నారు. స్నేహిత సపోర్ట్ సెంటర్లో 674 మంది భార్యాభర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మల్లారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దుర్గా, భరోసా సెంటర్ సిబ్బంది వినోద, సౌమ్య, హరిత, రేణుక, స్వాతి, నవనీత, స్నేహిత మహిళ సపోర్ట్ కేంద్రం సిబ్బంది వసంత, కృష్ణ, లావణ్య పాల్గొన్నారు.