గజ్వేల్, నవంబర్ 18: అభివృద్ధ్దిలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రోల్‌మోడల్‌గా నిలుస్తున్నదని, జిల్లాలో వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చూడడానికి రావాలని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గ అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర కార్మిక శాఖమంత్రి జి.వివేక్ అన్నారు. గజ్వేల్‌లో పట్టణంలోని కూరగాయల మార్కెట్లో రూ.3కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.1.06కోట్లతో కాటన్ మార్కెట్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో మార్కెట్‌కు ఆదాయంతో పాటు వ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. రైతులకు పెండింగ్ బోనస్ డబ్బులు త్వరలో ఖాతాల్లో వేస్తామని తెలిపారు. అనంతరం సెట్విన్ శిక్షణ కేంద్రంలో మహిళలకు సర్టిఫికెట్స్ మంత్రి ప్రదానం చేశారు. మాతాశిశు దవాఖానను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి సూపరింటెండెంట్ అన్నపూర్ణ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడారు. దవాఖానకు అవసరమైన నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మంత్రిని కోరారు.
రింగ్‌రోడ్డు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి వివేక్‌కు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల సౌకర్యార్థం నిర్మించిన కాటన్మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో చివరి దశలో ఉన్న బస్టాండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలన్నారు. అక్కారం, దాచారం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. గజ్వేల్ అభివృద్ధిపై మంత్రి, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఆర్డీవో చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, కార్యదర్శి జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.