సిద్దిపేట, మే 6: పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒకరికీ క్రమశిక్షణ చాలా ముఖ్యమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. మంగళవారం సిద్దిపేట సీపీ కార్యాలయంలో హోంగార్డు సిబ్బందికి దర్బార్ నిర్వహించి క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోంగార్డు నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు అందరూ పోలీస్ కుటుంబమన్నారు. యూనిఫామ్‌లో ఉన్నవారిని ప్రజలు నిత్యం గమనిస్తారని, అది తెలుసుకొని విధులు నిర్వహించాలని సూచించారు. చిన్న చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.
ప్రతి ఒకరూ ఆరోగ్య పరిరక్షణ కోసం రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్లో ఏదో ఒకటి తప్పకుండా నిత్యం ఆచరించాలన్నారు.మద్యం, మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. బెట్టింగ్‌లు, ఆన్లైన్ గేమ్ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ప్రతి శనివారం పరేడ్ నిర్వహించినప్పుడు సమస్యలను సంబంధిత అధికారులకు తెలుపాలని సూచించారు.
పోలీస్‌శాఖలో పనిచేస్తున్నప్పుడు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దని తెలిపారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణికుమార్, కార్తీక్ ,విష్ణుప్రసాద్, ఆర్ఎస్సైలు బాలకృష్ణ ,రంజిత్, సాయి చరణ్, హోంగార్డు అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.