జగదేవపూర్ సెప్టెంబర్16: భూ భారతి దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్లోని తహసీల్ కార్యాలయం, పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్ కార్యాలయంలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు.
అంతకు ముందు జగదేవపూర్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. దవాఖానకు వచ్చిన రోగులతో మాట్లాడారు. దవాఖానలో వైద్యం మంచిగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపీకౌంట్, ఫార్మా కౌంట్, మెడికల్ ఆఫీసర్ కౌంట్ తప్పకుండా మ్యాచ్ కావాలని మెడ్కల్ ఆఫీసర్ సత్యప్రకాశ్ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు.
దవాఖాన లోపల నిర్వహణ బాగుందని, దవాఖాన బయట పరిసరాలను శుభ్రం చేయించాలని ఎంపీడీవో రాంరెడ్డిని ఆదేశించారు. అనంతరం దౌలాపూర్లో పర్యటించిన ఆమె ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. గ్రామంలో 24 ఇండ్లు మంజూరు కాగా 22 వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఇంటి నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని ఆమె సూచించారు. ఆమె వెంట ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ నిర్మల, పంచాయతీ కార్యదర్శి సతీశ్, వైద్య సిబ్బంది ఉన్నారు.