జహీరాబాద్, ఫిబ్రవరి 3 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చెరాగ్‌పల్లి శివారులో హైదరాబాద్-ముంబయి 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన రవాణా శాఖ సరిహద్దు చెక్‌పోస్టులో సిబ్బంది కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చెక్‌పోస్టులో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న 9 ఏఎంవీఐలను బదిలీ చేసింది. దీంతో చెక్‌పోస్టులో వాహన తనిఖీ చేసేందుకు సరిపడా అధికారులు లేకపోవడంతో ఉన్న ఎంవీఐలు రాత్రీపగలు పనిచేస్తున్నారు.
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ చెక్‌పోస్టు ద్వారా రూ. 4 కోట్ల ఆదాయం లక్ష్యం విధించగా, లక్ష్యం చేరుకున్నారు. కాగా,చెరాగ్పల్లిలోని రాష్ట్ర సరిహద్దు రవాణాశాఖ చెక్‌పోస్టు ద్వారా ఆదాయం వస్తున్నా, ప్రభుత్వం ఏఎంవీఐలను నియమించకపోవడంతో ఉన్న అధికారులు రాత్రీపగలు పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెరాగ్పలి రవాణాశాఖ చెక్‌పోస్టులో 3 ఎంవీఐలు, 9 మంది ఏఎంవీఐలు ఉండేవారు. పూర్తిస్థాయి సిబ్బంది ఉండడంతో రాత్రీపగలు వంతుల వారీగా విధులు నిర్వహిస్తూ పక్కాగా వాహన తనిఖీలు చేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో ఆ పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది.
రాష్ట్ర సరిహద్దులోని చెరాగ్‌పల్లి రవాణా శాఖ చెక్‌పోస్టు మీదుగా నిత్యం 1100 వరకు లారీలు, వందలాది డీసీఎంలు, గూడ్స్ వాహనాలు, 100 వరకు ట్రావెల్స్ బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ర్ట వైపు వెళ్లే వాహనాలను సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేస్తారు. అనుమతి పత్రాలు లేకపోతే ఫీజు తీసుకుని అనుమతి పత్రాలు జారీచేస్తారు. వాహనాలు తనిఖీ చేసే ఏఎంవీఐలు లేకపోవడంతో ఎంవీఐలు తనిఖీ చేస్తున్నారు. వారికి కానిస్టేబుల్, హోంగార్డులు సహకరిస్తున్నారు. పనిభారం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెరాగ్‌పల్లి శివారులోని రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేస్తున్నాం. రవాణా శాఖ చెక్‌పోస్టులో 3 ఎంవీఐలు, 9 మంది ఏఎంవీఐలు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం చెక్‌పోస్టులో 3 ఎంవీఐలు మాత్రమే పనిచేస్తున్నాం. 9 ఏఎంవీఐలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎంవీఐ పోస్టులు ఖాళీగా ఉండడంతో పనిభారం పెరిగింది. జనవరిలో రాత్రీపగలు విధులు నిర్వర్తించి ప్రభుత్వం లక్ష్యం రూ. 5 కోట్లు వసూలు చేశాం. ఏఎంవీఐలు లేకపోవడంతో కానిస్టేబుల్, హోంగార్డులతో వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ఖాళీలను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని ఉన్నతాధికారులకు నివేదించాం.
– శ్రీనివాస్‌గౌడ్, చెరాగ్‌పల్లి ఎంవీఐ చెక్‌పోస్ట్ ఇన్చార్జి అధికారి