టేక్మాల్ : టేక్మాల్ మోడల్ స్కూల్లో(Tekmal) విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తమ తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ప్రతి రోజు పుస్తకాలతో కుస్తీ పట్టి చదువుకునే విద్యార్థులు ఉపాధ్యాయులుగా కొలువుదీరారు. నిత్యం పాఠశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు పోటీతత్వంతో చదువులు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు స్వయం పాలన దినోత్సవాన్ని వేదికగా చేసుకుని చదువులు చెప్పారు. నాయకత్వ లక్షణాలను కనబర్చడానికి వివిధ పదవులలో విద్యార్థులు చక్కగా వ్యవహరించారు. కలెక్టర్‌గా నైత్రిక, డిఈవోగా హర్షవర్ధన్ రెడ్డి, ఎంఈవో ఆరాధ్య, ప్రిన్సిపాల్‌గా సేవిత్ విహారి వ్యవహరిం చారు.విద్యార్థులు బోధిస్తున్న తీరుతెన్నులను పాఠశాల ప్రిన్సిపాల్ సుంకరి సాయిలు పర్యవేక్షించారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు బోధన తీరును పరిశీలించారు. స్వయం పాలన దినోత్సవంతో పాఠశాలలో విద్యార్థులు సందడి చేశారు. ప్రతి రోజు స్కూల్ యూనిఫామ్ లో వచ్చే విద్యార్థులు సీతాకోక చిలుకల వలే రంగు రంగుల వస్త్రధారణలతో రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన చేసిన బోధన తీరును పరిశీలించిన వారి ప్రతిభ ఆధారంగా ఉత్తమ ప్రతిభావంతులను గుర్తించారు.