మెదక్, మే 6 (నమస్తే తెలంగాణ) : బాలల హక్కుల రక్షణ కోసం కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్ తగ్గించేందుకు మౌలి క సదుపాయాలు కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్నారు. పోక్సో కేసులు నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ బాలల రక్షణ కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలలు, వసతి గృహాలు, అనాథ ఆశ్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. సమాజంలో మా ర్పు కోసం తల్లిదండ్రులు ,టీచర్లు కృషిచేయాలన్నారు. సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు వందనగౌడ్, చందన, సరిత, అపర్ణ, అగర్వాల్, వచన్‌కుమార్, సిద్దిపేట డీఆర్వో నాగరాజమ్మ, మెదక్ అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్‌సింగ్,ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.