మెదక్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేశ్ వ్యాస్ సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేశ్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడనుండగా, 10వ తేదీ వరకు నామిమేషన్లు దాఖలు చేసేందుకు గడువు అని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణలో సమయపాలన కచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్థులు సమర్పించే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆన్లైన్ యాప్లో నామినేషన్లను నమోదు చేయాలన్నారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలుచేయాలన్నారు. సి విజల్ యాప్ను ప్రజల్లోకి మరింత విసృ్తతంగా తీసుకెళ్లాలన్నారు. అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన 6 ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిషరించామన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫామ్-6, 7, 8లను వెంటనే పరిషరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీ, సీపీవో కృష్ణయ్య, డీఈవో రాధాకృష్ణ, డీఆర్డీవో శ్రీనివాస్, డీటీవో చిన్నసాయిలు, ఏడీవో గోవింద్, నర్సాపూర్, మెదక్ ఆర్డీఓలు శ్రీనివాస్, అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఈఆర్వోలు, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల అవుతుందన్నారు. నవంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు ఆర్వో కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు సమయపాలన పాటించాలన్నారు. వచ్చిన ప్రతి నామినేషన్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికీ తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలను అందించాలన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల విధులు నిష్పపాతంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని స్పష్టం చేశారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కాన్ఫరెన్స్లో ఎస్పీ రూపేశ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, రిటర్నింగ్, నోడల్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 30: సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల అంశాల పర్యవేక్షణకు సోషల్ మీడియాసెల్ ఏర్పాటు చేసినట్టు సంగారెడ్డి ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా సోషల్ మీడియా సెల్ వాట్సాప్ నెంబర్ 8977485088 ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎన్నికలతో ముడిపడిన జిల్లాకు చెందిన అంశాలను పర్యవేక్షించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఈ సెల్ 24 గంటలు పని చేస్తుందన్నారు. సోషల్ మీడియా సెల్ సిబ్బంది ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం తదితర సామాజిక మాధ్యామాల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన అంశాలను నిత్యం పరిశీలిస్తారన్నారు. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా, అసత్య వార్తలను ప్రచారం చేసినా, అభ్యంతరకర వీడియోలు, సందేశాలు తదితర అంశాలపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.