మెదక్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలు నమోదు చేయాలని మెదక్ జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెదక్ రిటర్నింగ్ అధికారి ఆఫీసును వ్యయ పరిశీలకుడు సంజయ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు లెకలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.
ప్రతి అభ్యర్థి బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలన్నారు. ఏఈవో, అకౌంటింగ్ టీంలకు తగు సూచనలు, సలహాలు అందించారు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెంచాలని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న వసతులు, సదుపాయాలు, కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీవీ మానిటరింగ్ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో లైజన్ అధికారి జిల్లా పరిశ్రమల శాఖ జీఏం కృష్ణ మూర్తి, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, అకౌంటింగ్ టీం, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.