సిద్దిపేట, జూన్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలకు చేర్చాల్సిన సూల్ బస్సుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అనేక ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులు ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోకపోయినా రోడ్లపైకి తీసుకువచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు సూల్ బస్సులకు రవాణాశాఖ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, వాహనం సురక్షితంగా ఉందో లేదో పరిశీలించాలి.
బ్రేకులు, టైర్లు, ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, సీసీ కెమెరాలు తదితర అంశాలను తనిఖీ చేసి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఈ ప్రక్రియ పూర్తికాకముందే బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. విద్యాసంస్థలు ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1512, సిద్దిపేట జిల్లాలో 412,మెదక్ జిల్లాలో190 వరకు బస్సులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బస్సుల సామ ర్థ్య పరీక్షలు నిర్వహణ పూర్తి కాలేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బస్సుల ఫిట్నెస్ సరి గ్గా లేక గతంలో ప్ర మాదాలు జరిగిన విష యం తెలిసిందే.
బస్సులను కండిషన్‌గా ఉంచాల్సిన బాధ్యత ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలదే. కానీ వారు అడ్మిషన్లపై ఉన్న శ్రద్ధ స్కూల్ బస్సులపై చూపించడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. అడ్మిషన్లు, స్కూల్ బస్సు ఫీజులు భారీగా గుంజుతున్నారు. బడి బస్సులపై శ్రద్ధ్ద చూపిస్తలేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరో వారం రోజులైతే పాఠశాలలు ప్రారంభమవుతాయి. ఇంకెప్పుడు ఫిట్నెస్ చేపిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయంలో అర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరించి ఫిట్నెస్ లేని బస్సులను సిజ్చేయాలని కోరుతున్నారు.
ఫిట్నెస్ దాటిన తర్వాత అట్టి బస్సులను నడిపితే వాటిని సీజ్ చేయడంతో పాటు స్కూల్ గుర్తింపు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కానీ అలా ఎక్కడా జరిగిన సందర్భాలు లేవు. బడి బస్సుల్లో కనీస సౌకర్యాలు తప్పనిసరి ఉండాలి. ప్రధానంగా అత్యవసర ద్వారం, మంటలు ఆర్పే పరికరాలు, ప్రథమ చికిత్స కిట్, అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు పగలగొట్టే గ్లాస్, కిటికీల వద్ద ఇనుప గ్రిల్స్, ఫైర్ అలారం, మంటలు ఆర్పే స్ప్రే ఇవే కాకుండా పిల్లలు పట్టుకునే విధంగా నిలువు రాడ్లు ఏర్పాటు చేయాలి.
ముందు, వెనుక భాగాల్లో లైట్లు, ఇండికేటర్లు, అద్దాలు ఉండాలి. తలుపుల వద్ద లాకింగ్ సిస్టం, పిల్లలు ఎక్కేందుకు వీలుగా పుట్‌బోర్డు పటిష్టంగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి బస్సులో ఉండాల్సిందే. అనుభవమైన డ్రైవర్లను నియమించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి తక్కువ జీతం ఇచ్చి అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమించుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు నడపాలంటే డ్రైవర్‌కు కనీసం ఐదేండ్ల అనుభవం ఉండి తీరాల్సిందే. అతడి లైసెన్స్ తనిఖీ చేయాలి.
ప్రతి ఏటా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్ చేయాలి. రోడ్డు ట్యాక్సీ, ఇన్సురెన్స్, ఆర్సీ, ఇతర ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉండాలి. పదిహేను సంవత్సరాలు దాటితే బస్సును స్కూల్‌కు వాడరాదు. కానీ కాలం చెల్లిన పాత బస్సులకు ఏదో రంగులు అద్ది ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తే అది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడినట్టే అవుతుంది. కనుక ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు లొంగకుండా ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫిట్‌నెస్‌లేని బస్సులను సీజ్ చేయడంతో పాటు అనుభవం లేని డ్రైవర్ల నియామకంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఫిట్నెస్ లేని పాఠశాలల బస్సులు రోడ్లపై తిరగడం విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. గతంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సూల్ బస్సుల ప్రమాదాలు ఇంకా ప్రజలకు గుర్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఆయా ఆర్టీఏ జిల్లా శాఖల పరిధిలో పాఠశాలలు, కళాశాల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు చేయడం ప్రారంభించారు. కానీ కొన్ని విద్యాసంస్థలు పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీరికి ఆర్టీఏ శాఖలోని కొంతమంది సిబ్బంది వంతపాడుతున్నారు. కాలం చెల్లిన వాహనాలకు రంగులు అద్ది నామమాత్రంగా పరీక్షలు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభం దగ్గరికి వచ్చినా ఇంతవరకు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి కాలేదు.
విద్యా సంవత్సరం ప్రారంభం దగ్గరపడుతున్నా కొన్ని ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారుల తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసి ఫిట్నెస్ లేని వాహనాలను వెంటనే నిలిపివేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పిల్లలను సూల్కు పంపించే ముందు బస్సుల భద్రతపై పూర్తి సమాచారం వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా రు. ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవర్ అర్హతలు, వాహన భద్రతా ప్రమాణాలను పాఠశాలలు బహిరంగంగా ప్రదర్శించాలి. ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయని బస్సులను రోడ్లపైకి రానివ్వకుండా రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే అనుమతులు రద్దు చేయాలి.