నిజాంపేట్, జూన్ 14: అసలే గుంతల రోడ్డు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూర్తిగా బురదమయమైంది. దీంతో ఆ రహదారిగుండా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ (Nizampet) మండల పరిధిలోని మునియపల్లి సమీపంలో ఉన్న నిజాంపేట్ ఎక్స్ రోడ్ నుంచి కల్లేరు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా గుంతలతో నిండిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో గతంలో చిన్నగా ఉన్న ఈ మార్గాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లైన్ల రోడ్డు కోసం మంజూరు చేసింది. 16 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తయింది. అయితే మునియపల్లి సమీపంలో అదే గ్రామానికి చెందిన రైతు భూమిలోనుంచి రోడ్డు వెళ్తుండటంతో నిర్మాణ పనులను అతడు అడ్డుకున్నాడు. తాను కోల్పోయే భూమికి బదులు మరోచోట భూమి ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాడు.
దీంతో వివాదాస్పదంగా మారిన 300 మీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని అధికారులు ఆపివేశారు. ప్రస్తుతం ఆ మార్గమే ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. రోడ్డు పూర్తిగా ధ్వంసం అవడంతో గుంతల మయమైంది. ఆ మార్గం గుండా వెళ్లాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆగిపోయిన పనులను పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.