అన్ని వసతులంటేనే ఓకే అంటున్న అభ్యర్థులు
పోటీ పరీక్షల సెంటర్ల ప్రాంతాల్లో పోటెత్తుతున్నఅభ్యర్థులు
సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారా.. అయితే మంచిదే. మరి ఎక్కడ ఉంటున్నాం, ఎలా ప్రిపేర్ అవుతున్నామన్నది ముఖ్యమే సుమా. పోటీ పరీక్షలు అనగానే హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్, నల్లకుంట లాంటి కొన్ని ప్రాంతాలు ఠక్కున గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతాల్లో సివిల్స్, గ్రూప్-1, 2, 3, 4 కోసం ప్రిపేర్ అయ్యేవారికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఆయా ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే సెంటర్లు డజన్ల కొద్దీ ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే ఉంటూ కోచింగ్ తీసుకునేవారు ఉంటారు. ఎటుచూసినా ఉద్యోగాభ్యర్థులు పుస్తకాలు పట్టుకొని, కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటారు. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ అతిసమీపంలో ఉండడం, స్టడీ మెటీరియల్, జిరాక్స్ సెంట ర్లు, పలు పబ్లికేషన్ల పుస్తకాలు ఇక్కడ దొరుకడమూ ఒక కారణం.
అమీర్‌పేట్‌లో ఐటీ రంగాల వారు..
అమీర్‌పేట్‌లో హాస్టళ్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ఐటీ, ఇతర ప్రైవేటు రంగాల్లో పని చేసే ఉద్యోగులకు అనువుగా ఉంటుందని కరుణాకర్‌రావు అనే ఉద్యోగి వెల్లడించారు. దిల్సుఖ్నగర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పోలీస్, బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఉంటారని ఎస్సైకి ప్రిపేరయ్యే శశాంక్మోహన్ తెలిపారు.
టెట్ నోటిఫికేషన్ రావడంతో..
టెట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇక త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ రానున్న తరుణంలో వసతి గృహాల వేటలో ఉద్యోగాభ్యర్థులు నిమగ్నమయ్యారు. అన్ని వసతులుంటే వెంటనే చేరిపోతున్నారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ కావడంతో వెంటిలేషన్ ఉంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. హాస్టళ్లలో అన్ని బాగుంటేనే ఆరోగ్యం గా ఉంటామని, దీంతోపాటు చదువుకు ఎలాంటి అంతరాయం ఏర్పడదని అభ్యర్థులు చెబుతున్నారు. వసతులను బట్టి నెలకు రూ.4 నుంచి 8 వేలకు పైగా ఫీజు చెల్లిస్తున్నట్లు అభ్యర్థులు, ప్రైవేటు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
రూ.4 వేల నుంచి 8 వేలకు పైగా ఫీజు..
అశోక్‌నగర్, గాంధీనగర్, చిక్కడపల్లిలో ఒక్కో వ్యక్తికి హాస్టల్ ఫీజు నెలకు రూ.4వేల నుంచి 4500 వరకు ఉంటుంది. సాధారణ వాష్ రూమ్స్‌తో పాటు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందజేస్తున్నారు. పప్పు, సాంబార్, ఒక కర్రీ ఇస్తున్నట్లు అభ్యర్థి సురేశ్ తెలిపారు. దీంతోపాటు వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నలుగురు ఒక రూంను షేర్ చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక రూంలైతే రూ.7వేల నుంచి 7500 వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరూ లేదా ముగ్గురుంటే రూ.5వేల నుంచి 5500 వరకు ఫీజు తగ్గుతుందని, ఒక్కరే ఉంటే చార్జీ పెరుగుతుందని, ఏసీ గదులకైతే ఒకే రూంలో ముగ్గురు ఉంటే ఒక్కొక్కరికి రూ.7వేల చార్జి ఉంటుందని, ప్రత్యేక ఏసీ గది అవరమైతే రూ.8500 నుంచి రూ.10వేల వరకు ఫీజు ఉంటుందని చెప్పారు. ఈ విధానాన్నే నగరంలోని అన్ని హాస్టళ్ల నిర్వాహకులు అమలుచేస్తున్నట్లు అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్ వార్డెన్ తెలిపారు. అవసరమైన వస్తువులు తప్ప అభ్యర్థులు ఎక్కువగా లగేజీ కూడా తీసుకురావద్దని సూచించారు.
అన్ని వసతులుంటేనే చదువగలం
హాస్టళ్లలో అన్ని వసతులుండాలి. పో షకాహారం, గాలి, వెలుతురు, సిట్టింగ్ తో పాటు మంచాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. చుట్టూ వాతావర ణం బాగుంటేనే చదివింది గుర్తుంచుకోగలం. స్థాయికి తగ్గట్టు ఒక మంచి హాస్టల్‌ను చూసుకుని ఉండాలి. కల నెరవేరాలంటే ఉద్యోగం సాధించి బయటికి రావాలి. హాస్టల్ నుంచి కోచింగ్ సెంటర్‌కు, అక్కడి నుంచి లైబ్రరీకి వెళ్లొచ్చు. పాకెట్ మనీ రూ.15 వందలుంటే చాలు. – చంద్రశేఖర్, గ్రూప్-1 అభ్యర్థి