Road | మునిపల్లి, ఏప్రిల్ 14 : తన ఇంటి ముందు సీసీరోడ్డు ఉట్టిగా వేయలే.. మా ఇంటి ముందు సీసీ రోడ్డు వేయండి అయ్యా అంటూ సర్పంచ్ భర్త రుద్రకృష్ణ కాళ్లపై పడితే సీసీ రోడ్డు వేశారాని ఓ మహిళ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడలోని ఒకటో వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ భర్త ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకటో వార్డులోని రుద్ర రాజు ఇంటి నుంచి మంగలి స్వరూప ఇంటి వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేశారు.
మంగలి స్వరూప ఇంటి నుంచి అయ్యలి జగదాంబ (బీఆర్ఎస్ పార్టీ) కి సంబంధించిన వ్యక్తి ఇంటి వరకు రోడ్డు వేయకుండా నిలిపివేశారు. మీ ఇంటి ముందు మీ సొంత డబ్బులతో మొరం వేసుకుంటే.. రోడ్డు వేస్తామంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని మొరం వేసిన తర్వాత రోడ్డు వేయకుండా వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇండ్ల ముందు నేను రోడ్డు వేయను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. అన్నట్టు సర్పంచ్ భర్త రుద్రాకృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఉంటేనే గ్రామ అభివృద్ధి జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలని స్థానికులు వాపోతున్నారు.
కాళ్లు మొక్కితేనే రోడ్డు వేశాను. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఒకటో వార్డులో ఓ మహిళ తన ఇంటి ముందు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాళ్లు మొక్కితేనే సీసీ రోడ్డు వేసిన ఉత్తగ వేయలేను అని స్థానిక సర్పంచ్ భర్త చెప్పడం విమర్శలకు దారితీస్తుంది.
రోడ్డు వేసేందుకు కొలతలు కొలిచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు ఓటు వేయలేదు వాళ్ళ ఇంటి ముందు రోడ్డు వెయ్యను అనేలా సర్పంచ్ భర్త తీరు పలు రకాల విమర్శలకు దారితీస్తుంది. ఇండ్ల ముందు రోడ్డు వేయాలంటే కాళ్లు మొక్కాలా..? కాళ్లు మొక్కకపోతే రోడ్డు వేయరా అని స్థానికులు సర్పంచ్ తీరుఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులకే సీసీ రోడ్డుకు పగుళ్లు..
మండలంలోని చిన్నచెల్మడలో 1వ వార్డులో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డుకు 48 గంటలు గడవకముందే పగుళ్లు రావడంపై పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డులో ఇసుక కలపకుండా డస్టుతో నిర్మాణం చేపట్టినట్లు వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సంబంధిత అధికారులు పర్యటించి నాసిరకమైన పనులకు బిల్లులు ఇవ్వకుండా నాణ్యతతో కూడిన పనులకు మాత్రమే బిల్లులు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నాత అధికారులను కోరుతున్నారు.
