రాయపోల్ ఆగస్టు 26: వినాయక చవితి వేళ సిద్దిపేట జిల్లాలో రాయపోల్ మండలంలో పురాతన కాలానికి చెందిన రాతి గణపతి విగ్రహం (Stone Ganesh Idol) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయం లేకుండా ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహానికి ఘన చరిత్ర ఉందని స్థానికులు అంటున్నారు. ఐదడుగులకుపైగా ఎత్తుతో.. బంగారు వర్ణంలో ధగధగ మెరుస్తూ కనిపించే ఈ విగ్రహం ఉన్న చోట ఇటీవలే ఆలయాన్ని నిర్మించారు. ఆలయం వెలుపల భారీ రాతి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు.
అప్పట్లో రావిప్రోలుగా పిలువబడిన ఈ గ్రామంలో గావుండ హువిన అనే రాజు కొడుకు జువ్విరడ్డి గణపతి విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా ఆధారాలున్నాయి. కళ్యాణీ చాళుక్య చక్రవర్తి ఆహవనమల్ల 1వ సోమేశ్వరుడి కాలం నాటి శాసనంలో ఈ విగ్రహం క్రీ.శ.1048 నాటిదని రాసి ఉంది.
ఈమధ్యే నిర్మించిన ఆలయం
లలితాసనంలో కనిపిస్తున్న శిల్పం శైలిని బట్టి 8, 9 శతాబ్దాల కాలంనాటి రాష్ట్ర కూటుల నాటిది అయి ఉంటుందని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. పురావస్తు శాఖ అధికారులు ఈ భారీ రాతి విగ్రహంపై పూర్తిగా అధ్యయనం జరిపి.. దీని ప్రతిష్ట, ప్రత్యేకతలను వెలుగులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.