కంది, డిసెంబర్ 1: శారీరకరంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం హాఫ్ మారథాన్ 2024ను అట్టహాసంగా నిర్వహించారు. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్) 10కే రన్, 5కే రన్లో దేశ నలుమూలల నుంచి 1500 మంది పోటీదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాలావత్ హాజరయ్యారు. సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, క్రమశిక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ తమ దినచర్యలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని సూచించారు. పూర్ణ మాలావత్ మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ హాఫ్ మారథన్ స్ఫూర్తిని నింపి చక్కని జీవనశైలిని ప్రేరేపిస్తున్నదన్నారు. ఐఐటీహెచ్ హాఫ్ మారథాన్ 2024 కేవలం ఒక పరుగు పోటీ కాకుండా ఉల్లాసానికి ప్రతీకగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు ప్రేమ్‌పాల్, డాక్టర్ హిమాంశు జోషి, డాక్టర్ ఉపేందర్ సుంకరి, విద్యార్థులు పాల్గొన్నారు.