
వ్యవసాయంతో పాటు పశుపోషణ, పాడిపరిశ్రమ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. వానకాలంలో వ్యాపించే వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కాలంలో పశువులకు రకరకాల వ్యాధులు సోకుతుంటాయి. తద్వారా పాడిపశువుల్లో పాలదిగుబడి తగ్గడం, దుక్కిపశువులు పని సామర్థ్యం కోల్పోవడం, పడ్డలు, పెయ్యలు ఎదకు రాకపోవడం ముఖ్యంగా ప్రాణ నష్ట
సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. రైతాంగం పశువుల్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పశువు వెనుక భాగాన్ని, ముందు భాగాన్ని పరిశీలించడం ద్వారా పశువుల ఆరోగ్య సమస్యలు, ఎద లక్షణాలు గమనించవచ్చు. ఈ నేపథ్యంలో వానకాలంలో పశువులకు సోకే వివిధ వ్యాధులు, వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
గొంతు వాపు వ్యాధి(హెచ్.ఎస్)..
వానకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో ‘గొంతు వాపు’ ప్రధానమైనది. దీనినే గురకవ్యాధి, కంఠమడ అని కూడా పిలుస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో ఇది ఎక్కువగా సోకుతుంది. గడిచిన 4 దశాబ్దాల కాలంలో సంభవించిన మరణాలు 46-55 శాతం గొంతువాపు వ్యాధి వల్ల సంభవించినవే. గొంతువాపు సోకిన పశువుల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ కారుతుంది. గొంతు, మెడ వాస్తాయి. శ్వాస కష్టమై, గురక శబ్దంతో 24గంటల్లో పశువు మృతి చెందే అవకాశముంటుంది. వ్యాధి నిర్ధారణ కచ్చితంగా వీలైనంత త్వరగా చేయాలి. సాధారణంగా రక్తపరీక్షల ద్వారా వ్యాధి కారక బైపోలార్ బాక్టీరియా గుర్తించి వ్యాధి నిర్ధారిస్తున్నారు. పశువు శారీరక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సేకరించిన రక్తంలోనే బాక్టీరియా కనిపిస్తుంది. దీన్ని వేరు చేసి, గుర్తించడం తేలికైన పనేమికాదు. మూలగతో సహా పశువు ఎముకను ఐస్‌లో ఉంచి పరీక్షకు పంపితే 3రోజుల్లో వ్యాధి నిర్ధారణ సాధ్యమవుతోంది.
చికిత్స ఇటీవల ఎన్నో కొత్త మందులు, యాంటి బయోటిక్స్ లభిస్తున్నాయి. సల్ఫాడిమిన్, ఇంటాసెఫ్ టాజు, ఎక్సెప్ట్ మొదలగు ఇంజెక్షన్లు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి పశువైద్యుల సలహాలు వాడాలి.
కురంవ్యాధి(ఎపిమెరల్ ఫివర్)..
వానకాలంలో తరచుగా వచ్చే వాధుల్లో ఈ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి సోకడం వల్ల అధిక జ్వరం, కండరాల వణుకు, కాళ్లనొప్పితో బాధపడు
తుంటాయి. ఇలా బాధపడే పశువులకు ‘కురం వ్యాధి’ సోకిందని గ్రహించాలి. రెబ్డో వైరస్ ద్వారా దేశీ, విదేశీ జాతి పశులన్నింటిలో ఈ వ్యాధి సోకుతుంది. ఈగలు, దోమల కాటు ద్వారా పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వానకాలంలో ఈగలు, దోమల బెదడ ఎక్కువగా ఉన్నందున కురం వ్యాధి తరచుగా కన్పిస్తోంది. ఈ వ్యాధితో పశువుల్లో మరణాలు తక్కువే అయినప్పటికీ వ్యాధి సోకిన దుక్కి పశువులు పని చేయవు. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. పశువుల్ని ఈగలు, దోమలు కాటు వేసిన తర్వాత లక్షణాలు 2-10 రోజుల్లో కనపడతాయి. వ్యాధిని కలిగించే వైరస్ పశువు రక్తంలో అభివృద్ధ్దిచెంది కాళ్లు, కండరాలు, వినాల గ్రంథులకు వ్యాపిస్తుంది. బలవంతంగా పశువుల్ని లేపినా నొప్పి ఉండడంతో అతి కష్టంగా నడుస్తాయి. నొప్పి ఒక కాలు నుంచి మరో కాలుకి గంటల వ్యవధిలో మారుతుంది. మేత తినవు, నెమరు వేయవు, నీరసంగా ఉంటాయి. ముక్కు నుంచి స్రవాలు, నోటి నుంచి చొంగ, కండ్ల నుంచి నీరు కారుతుంది. మెడ, కండరాలు గట్టిగా ఉంటాయి. ఈ సమయంలో బలవంతంగా మందులు తాగిస్తే, న్యూమోనియాతో 2-3 శాతం పశువులు మృతి చెందే ప్రమాదం ఉంది.
చికిత్స : వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయించాలి. యాంటి పైరెటిక్స్, అనాల్జెసిక్స్, కాల్షియం, యాంటీ బయోటిక్స్ మొదలగునవి వాడాలి. వ్యాధి ఒక ప్రాంతంలో పశువులకు ఎంత త్వరగా ప్రారంభమై వేగంగా వ్యాపిస్తుందో, అంతే త్వరగా కొన్ని వారాల్లో పశువులు కోలుకుంటాయి. వ్యాధి నివారణకు వానకాలంలో ఈగలు, దోమల్ని నిర్మూలించాలి. మురుగు నీరు నిల్వ ఉండకుండా, పాకల్లో రొచ్చు, చెత్తాచెదారం చేరకుండా, పాకలు పొడిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పశువుల్ని ప్రతిరోజూ గ్రూమింగ్ చేస్తుండాలి. పశువుల కొట్టాల వద్ద రాత్రి వేళల్ల్లో వేప ఆకు కల్చడం వల్ల ఈగలు, దోమల బెడద తగ్గుతుంది.
వానకాలం పశువులు, జీవాల పై అప్రమత్తంగా ఉండాలి
వానకాలంలో పశువులకు సోకే వ్యాధుల పై ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. వ్యాధులు సోకిన వెంటనే పశువైద్యులను సంప్రదించి, వైద్యం చేయించాలి. అప్రమత్తంగా వ్యవహరించకపోతే పశువులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సకాలంలో పశువులకు, గొర్రెలకు టీకాలు వేయించాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
గాలికుంటు వ్యాధి..
గాలికుంటు వ్యాధి సోకిన పశువులు చాలా బలహీనంగా ఉంటాయి. పాలు ఇచ్చే గేదెలు చాలా నీరసంగా ఉంటాయి. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధి సోకిన పశువు లకు నోటిగిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. మూడు నాలుగు వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతా యి. చర్మం గురుకుగా మారుతుంది, నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం ద్వారా పశువులు సరిగా మేత తీసుకోక పోవడంతో నిరశించి పోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది.