
చేర్యాల/కొమురవెల్లి, ఆగస్టు 24: తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో కులవృత్తులకు చేయూతతో పూర్వ వైభవం వచ్చిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్, కొమురవెల్లి, రసూలాబాద్, గౌరాయపల్లి గ్రామాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమురవెల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
సర్దార్ సర్వాయి పాపన్న బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నాడే పోరాటం చేశాడని, 12మందితో ప్రారంభించిన ఆయన పోరాటం 12వేల మంది సైనికుల వరకు చేరిందని, 30 ఏండ్ల పాటు 33 కోటలను ఆయన జయించి, వాటిని వివిధ వర్గాలకు కోటలను పరిపాలించుకోవాలని అప్పగించినట్లు తెలిపారు. నాడే 35 చెరువులను తవ్వించి, రైతులకు సాగు నీటిని అందించేందుకు పాపన్న కృషి చేశారన్నారు. పాపన్న ఒక్క కులం, వర్గానికి చెందిన వ్యక్తి కాదని, బహుజనుల కోసం పోరాటం సాగించిన మహా వీరుడని, ఒకే రోజు నాలుగు విగ్రహాలు ఆవిష్కరించడం ఓ రికార్డుగా అభివర్ణించారు. ఆయన ఆశయాల సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకొని గౌడన్నలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కొమురవెల్లిలో నిత్యాన్నదాన సత్రం కోసం స్థలం కేటాయింపునకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి కృషి చేయాలని కోరారు. దానికి తనవంతుగా నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరును పెట్టేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీఎం దృష్టికి తీసుకుపోతే, తనవంతు సహాయసహాకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం మంత్రి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పల్లె రవికుమార్, ఎంపీపీ తలారీ కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిద్ధప్ప, మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, సర్పంచ్ లత, పీఏసీఎస్ డైరెక్టర్ బత్తిని నర్సింహులుగౌడ్, ఎంపీటీసీ కొయ్యడ రాజమణి, గౌడ్ సంఘం ప్రతినిధులు ముత్యం నర్సింహులుగౌడ్, మెరుగు కృష్ణాగౌడ్, మెరుగు శ్రీనివాస్‌గౌడ్, పచ్చిమడ్ల స్వామిగౌడ్, కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.