జహీరాబాద్, అక్టోబర్ 7 : సంగారెడ్డి జిల్లా జహీరామాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్‌నగర్ ప్రధాన రోడ్డు మార్గంలోని ఆక్రమణలపై మంగళవారం మున్సిపల్ అధికారులు కొరఢా ఝుళిపించారు. స్థానిక పట్టణంలోని దత్తగిరి కాలనీలోని ఆదర్శ్‌నగర్‌కు వెళ్లే 50 ఫీట్ల ప్రధాన రోడ్డును కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. ఈ రోడ్డు మార్గంలో ఇరువైపులా పలువురు ఇండ్ల ముందు మెట్లు, షెడ్లు తదితర వాటిని అక్రమంగా నిర్మించారు.
ప్రతి రోజూ ఈరోడ్డు మార్గం ద్వారా వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లపైనే వాహనాలు నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పట్టణంలోని దత్తగిరి,ఆదర్శ్‌నగర్ కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సుభాశ్‌రావు రోడ్డు మార్గంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి ఇదివరకే నోటీసులు ఇచ్చారు.
స్వచ్ఛందంగా తొలగించుకోవాలని అధికారులు హెచ్చరించినా ఆక్రమణదారులు పట్టించుకోకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. ఆక్రమించుకున్న ఆదర్శ్‌నగర్‌కు వెళ్లే రోడ్డును ఇదివరకు 50 ఫీట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించడంపై ఆయా కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేని పక్షంలో కూల్చివేతలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సుభాశ్‌రావు హెచ్చరించారు. ఆదర్శ్‌నగర్ కాలనీ ఒక్కటే కాదు అంచెలంచెలుగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత చర్యగా జహీరాబాద్ పట్టణ, రూరల్ ఎస్సైలు వినయ్‌కుమార్, కాశీనాథ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రోడ్డుపై నిర్మించిన ర్యాంపు తొలగింపు
బొల్లారం, అక్టోబర్ 7: సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని పోచమ్మబస్తీ సూర్యభగవాన్ ఆలయం ముందు రోడ్డుపై నిర్మించిన ర్యాంపును అధికారులు తొలగించారు. కమిషనర్ కిషన్ ఆదేశాలతో మంగళవారం మున్సిపల్ కార్మికులు జేసీబీ సహాయంతో ర్యాంపును కూల్చివేశారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… ర్యాంపు తొలగించాలని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్థానికులను ఆయ న హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు,స్థానికులు పాల్గొన్నారు.