సంగారెడ్డి మార్చి 7(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ బదిలీఅయ్యారు. ప్రభుత్వం 21మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీ రూపేశ్‌ను హైదరాబాద్‌లోని యాంటీనార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేశారు. జిల్లా నూతన ఎస్పీగా పారితోశ్ పంకజ్ నియమితులయ్యారు. కొత్తగూడెం ఓఎస్డీగా ఉన్న పారితోశ్ పంకజ్‌ను సంగారెడ్డి జిల్లా ఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించింది ప్రభుత్వం.
పారితోశ్ పంకజ్ శనివారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చెన్నూరి రూపేశ్ అక్టోబర్ 13, 2023 నుంచి సంగారెడ్డి జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. నవంబర్, 2023లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు జరిగిన జనరల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల అమ్మకం, రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. పోలీసుల భద్రతకు, సంక్షేమానికి ఎస్పీ రూపేశ్ ప్రాధాన్యత ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా శనివారం పారితోశ్ పంకజ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పారితోశ్ స్వస్థలం బీహారులోని భోజ్‌పురి జిల్లా ఆరానగరం. 2010 నుంచి 2015 వరకు ప్రైవేట్ రంగంలో పనిచేసిన పారితోష్ పంకజ్ 2015లో మర్చంట్ నేవీలో సెకండ్ నావిగేటింగ్ కమాండర్‌గా పనిచేశారు. 2020లో ఐపీఎస్‌గా ఎంపికైన పారితోశ్ శిక్షణ పూర్తయిన తర్వాత గ్రేహౌండ్స్ ఆసాల్డ్ కమాండర్‌గా పనిచేశారు. 2023లో భద్రాచలం అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఉద్యోగోన్నతిపై 2024లో కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టారు.