
కంగ్టి, ఆగస్టు 26: కంగ్టి మండలంలో బృహత్‌పల్లె ప్రకృతి వనం కోసం భూపరిశీలన చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం మండలంలోని ముకుంద్నాయక్ తండా శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిమండలంలో 10ఎకరాల్లో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇందులో భాగంగా ముకుంద్నాయక్ తండా శివారులో ఉన్న భూమిని పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే పల్లెప్రకృతివనం పనులు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ సురేఖవెంకట్ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ముకుంద్నాయక్ తండా పరిధిలో ఉన్న వాచునాయక్ తండాకు సంబంధించిన నిధులు కంగ్టి గ్రామపంచాయతీ మరులుతున్నాయన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అదనపు కలెక్టర్ వెంట డీఆర్డీవో శ్రీనివాస్‌రావు ఉన్నారు.
అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష
నారాయణఖేడ్, ఆగస్టు 26: నారాయణఖేడ్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా అధికారులతో డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలను సమీక్షించారు. ప్రధానంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనుండగా ప్రభుత్వ పాఠశాలలు శానిటైజ్ చేయడంతో పాటు పాఠశాలలన్ని శుభ్రపర్చే విధంగా చూడాలన్నారు. ఉపాధిహామి పథకంలో ఎవెన్యూ ప్లాంటెషన్, బండ్ ప్లాంటేషన్, మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేపట్టే దిశగా దృష్టి సారించాలని సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం ఇప్పటికే ఎంపిక చేసిన స్థలాల్లో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాసరావు, సీఈవో ఎల్లయ్య పాల్గొన్నారు.
ప్రగతి ని పరిగెత్తించండి…
నాగల్గిద్దా/మనూర్, ఆగస్టు 26: మండలంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాజార్షిషా అధికారులకు ఆదేశించారు. తిమ్మాపూర్, పుల్కుర్తి గ్రామాలను ఆకస్మికంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం లో చేపడుతున్న డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనాలు తదితర అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. వచ్చేనెల 1నుంచి పాఠశాల పునఃప్రారంభం కానున్న నేపథ్యం లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లను అధికారులు పర్యవేక్షించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాసరావ్, ఏపీడీ రాంబాబు, ఎంపీడీవో షాజిలొద్దీన్ ఉన్నారు.