సంగారెడ్డి, జూలై 14: పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు సంగారెడ్డి పట్టణంలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గృహకల్ప ఫ్లాట్లు నిరూపయోగంగా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి పట్టణంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లను కట్టించి ఇచ్చేందుకు అప్పట్లో గృహకల్పకు అడుగుల పడ్డాయి. ప్రభుత్వం పేదవారికి త్వరగా ఫ్లాట్లు అందించాలనే ఉద్దేశంతో రూ.708.48 కోట్ల నిధులు మంజూరు చేసింది. శాఖల వారీగా విభజించి నిర్మాణాలు మొదలుపెట్టారు.18 బ్లాకులుగా విభజన చేసి లబ్ధ్దిదారుడి వాటా నిధులను ప్రభుత్వానికి చెల్లించారు.
అందులో గృహనిర్మాణశాఖ అధికారుల పర్యవేక్షణలో 4బ్లాకులు 96 ఫ్లాట్లు, ఇంటేగ్రెల్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో 2 బ్లాకులు 48 ఫ్ల్లాట్లు, స్టేర్లింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ 2 బ్లాకులు, తేజ ప్రాజెక్టు పరిధిలో 10 బ్లాకులు 240 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గృహకల్ప సముదాయాన్ని ఏకకాలంలో నిర్మించి లబ్ధ్దిదారులందరికీ ఒకేసారి ఫ్ల్లాట్లను కేటాయించాలని లక్ష్యంతో పనులు ప్రారంభించారు. తేజ ప్రాజెక్టు కంపెనీకి కేటాయించిన ఫ్లాట్లు ప్రభుత్వం ఆశించిన మేరకు పూర్తికాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు చేపట్టిన ఫ్లాట్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయాయి. మిగతావి ఫ్లాట్లను అధికారులు లబ్ధ్దిదారులకు సకాలంలో పూర్తిచేసి కేటాయించారు.
తేజ ప్రాజెక్టు చేపట్టిన ఫ్లాట్లను సకాలంలో నిర్మించి లబ్ధ్దిదారులకు కేటాయిస్తే వాటాధనం చెల్లించిన వారికి అద్దెల బాధ తప్పేది. ఇప్పటికీ అద్దె ఇండ్లల్లో ఉంటూ రాజీవ్ గృహకల్పలో తమకు ఫ్లాట్ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. తాము చెల్లించిన వాటాధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉంటే మూడింతలు అయ్యేవని, ఫ్ల్లాట్ వస్తుందనే ఆశతో ఇప్పటికీ ఉన్నామని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 240 ఫ్ల్లాట్లు పూర్తిచేసి లబ్ధ్దిదారులకు అందిస్తే ఒక వార్డుతో కొత్తగా ఏర్పాటు అవుతుంది. ఇన్నేండ్లనా తమకు ఫ్లాట్ రాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని నిర్మాణాలు పూర్తిచేయించి తమకు ఫ్లాట్లు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
నాలుగు బ్లాకుల్లో 96 ఫ్ల్లాట్లకు ఒక్కో లబ్ధ్దిదారుడి వాటాగా రూ.28 వేలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కలిపి రూ.1.33లక్షలు కాగా, మొత్తం రూ.127.68కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 2 బ్లాకుల్లో 48 ఫ్ల్లాట్లకు లబ్ధ్దిదారుడి వాటాగా రూ.1.50 లక్షలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కలిపి రూ.2.10 లక్షలు కాగా, మొత్తం రూ.100.8 కోట్లకు అనుమతిచ్చింది. స్టేర్లింగ్ కన్స్ట్రక్షన్ సిస్టంతో రెండు బ్లాకుల్లో లబ్ధ్దిదారుడి వాటాగా రూ.1.25 లక్షలు, కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు రూ.2.30లక్షలు కాగా, మొత్తం రూ.110.40 కోట్లు, తేజ ప్రాజెక్టు చేపట్టిన 240 ఫ్ల్లాట్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవడంతో లబ్ధ్దిదారులు తమకు ఫ్ల్లాట్లు వస్తాయే..రావో అనే ఆందోళనలో ఉన్నారు. ఈ ఫ్ల్లాట్ల లబ్ధ్దిదారులు తమ వాటాధనం కింద రూ.49 వేల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాధనంతో కలిపి రూ.1.54లక్షలు కాగా, మొత్తం రూ.369.6కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 18 బ్లాకులకు గానూ 8 బ్లాకులు పూర్తిచేసి లబ్ధ్దిదారులకు ఫ్లాట్లు కేటాయించారు. మిగతా 10బ్లాకుల్లో నిర్మాణ దశలో ఉన్న ఫ్ల్లాట్లను త్వరగా పూర్తిచేసి తమకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.