RVM | ములుగు, మే 20: ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి అన్నవాహికలో ఇరుక్కున్న ఎముకను వైద్యులు తొలిగించారు. మంగళవారం వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు. జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన యాదగిరి భోజనం చేస్తూ అనుకోకుండా ఎముకను మింగడంతో అతడి అన్నవాహికలో ఇరుక్కుపోయింది. అన్నవాహికలోని చాలా భాగాలను ఎముక కత్తిరించినట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో రోగికి శ్వాస సంబంధిత, జీర్ణక్రియ సమస్యలు తలెత్తడంతో ఆర్వీఎం దవాఖానలో చేరారు. గ్యాస్ట్రోస్కోపీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అన్నవాహికలో ఎముక ఇరుక్కున్నట్లు గుర్తించి ఓ విస్కో ద్వారా ఎముకను తొలిగించినట్లు వైద్యులు తెలిపారు. తమ దవాఖానలో లాభాపేక్ష లేకుండా రోగులకు వైద్యసేవలు అందించినట్లు దవాఖాన చైర్మన్ డాక్టర్ యాకయ్య, సీఈవో శ్రీనివాస్‌రావు తెలిపారు. సుమారు రూ.15 లక్షల విలువైన ఈ చికిత్సను ఉచితంగా అందించినట్లు వారు తెలిపారు.