నర్సాపూర్, అక్టోబర్14: దొరికిందే సందన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం టికెట్ రేట్లు పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది. దసరా పేరుతో స్పెషల్ బస్సులంటూ ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువునా ముంచుతుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల్లో అధిక రేట్లకు టికెట్లు ఇవ్వడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. నర్సాపూర్ బస్టాండ్ ఎదుట బస్సులు నిలిపి ఆందోళన చేపట్టారు. పైగా పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ స్పెషల్ పేరుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను నిలువునా ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రేట్లు పెంచడంతో కూలీకి వెళ్లే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు రూ.60 ఉంటే నేడు రూ.130 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకొని ఏదైనా సమస్య ఉంటే డిపో యాజమాన్యంతో మాట్లాడుకోవాలని నచ్చజెప్పారు. ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించగా దసరా సందర్భంగా ఈ ఒక్క రోజే టికెట్‌పై ఎక్కువ రేటు చార్జ్ చేశామని చెప్పారు.
సిద్దిపేట టౌన్, అక్టోబర్ 14: పండుగ పబ్బం ఏదైనా సరే సాధారణ చార్జీలతోనే బస్సులను నడుపుతామని చెప్పిన ప్రజా రవాణా ఆర్టీసీ దసరాకు మాట తప్పింది. పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రయాణికుల నుంచి అదనపు బస్సు చార్జీలను ముక్కు పిండి వసూలు చేసి ప్రయాణికుల నమ్మకాన్ని కోల్పోయింది. స్పెషల్ బస్సుల పేరట అదనపు చార్జీల వసూళ్లుకు తెరలేపింది.
సుమారు 30శాతం చార్జీలు పెంచి అదును చూసిదెబ్బ కొట్టింది. పండుగకు ముందు సిద్దిపేట నుంచి జేబీఎస్ 140 రూపాయలను తీసుకున్న ఆర్టీసీ తిరుగు ప్రయాణంలో టికెట్ ధరను అమాంతం రూ.200లకు పెంచిం ది. అదే విధంగా హన్మకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం సాధారణంగా రూ.300 ఉంటే పండుగ వేళ 420 రూపాలను పెంచి వసూలు చేసింది. ప్రభుత్వం తమ అవసరాన్ని ఆసరాగా చేసుకొని అదుపు చార్జీలను వసూలు చేయండంపై ప్రయాణికులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేగుంట, అక్టోబర్14: దసరా, బతుకమ్మ పండు గలకు సొంతూరు వెళ్లిన ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో సరైన బస్సులు లేక తిప్పలు తప్ప డం లేదు. గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు వచ్చే బస్సులు కిక్కిరిసిన ప్రయాణికులతో రావడంతో గంటల తరబడి వేచి ఉన్నా ఎక్కేందు కు స్థలం లేక బ్యాగులు, వస్తువులు పట్టుకొని బస్టాండ్లలో నిలబడిపోయారు.