ఏడుపాయల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ మెదక్ డిపో నుంచి 37,సంగారెడ్డి నుంచి 30 సర్వీసులు
బాలానగర్ నుంచి టేకులగడ్డకు 10..
మెదక్ నుంచి ప్రతి 10 నిమిషాలకు..
టేకులగడ్డ నుంచి ఆలయం వరకు ఉచిత రవాణా
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 25 : మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవానీ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర సందర్భంగా లక్షలాదిగా భక్తులు రానుండగా, రవాణా కోసం ఆర్టీసీ బస్సులను పెట్టింది. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 28 నుంచి 4వ తేదీ వరకు మెదక్ డిపో నుంచి 37 ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సులు సంగారెడ్డి వయా జోగిపేట మీదుగా టేకులగడ్డ వరకు 30 బస్సులు నడిపిస్తున్నది. మెదక్ డిపో నుంచి ప్రత్యేకంగా బాలానగర్ నుంచి టేకులగడ్డ వరకు 25 పల్లె వెలుగు బస్సులు, మెదక్ నుంచి నాగసాన్పల్లి వరకు 12 బస్సులను ప్రతీ 10 నిమిషాల వ్యవధిలో ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. జేబీఎస్ నుంచి ఏడుపాయల వరకు పెద్దలకు ఒక్కొక్కరికి టికెట్ రూ.120 , 12ఏండ్లలోపు వారికి పిల్లలకు రూ.60 చొప్పున ధర నిర్ణయించింది. మెదక్ నుంచి ఏడుపాయల వరకు పెద్దలకు రూ.30, 12ఏండ్లలోపు పిల్లలకు రూ.15 తీసుకోనున్నారు. టేకులగడ్డ నుంచి ఏడుపాయల దేవస్థానం వరకు, నాగసాన్పల్లి నుంచి ఏడుపాయల దేవస్థానము వరకు 5 మినీ ఉచిత బస్సులు నడిపిస్తున్నది. భక్తులు ఎవరైనా 30మంది కలిసి ప్రయాణించాలనుకుంటే ఇంటివద్దకే బస్సు పంపిస్తామని మెదక్ డీఎం ప్రణీత్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9494093486, 7382830351, 7382829 623 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
ఏడుపాయల జాతరకు పటిష్ట బందోబస్తు
పాపన్నపేట, ఫిబ్రవరి 25: ఏడుపాయల జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి ఎస్పీ రమణకుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఏడుపాయల వనదుర్గాభవానీమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఏడుపాయల జాతరకు సంబంధించి ఎలాంటి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారని మెదక్ డీఎస్పీ సైదులును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఏర్పాటు చేసి న క్యూలైన్లతో పాటు స్నాన ఘట్టాలు, చెక్‌డ్యాం, ఘనపూర్ ఆనకట్ట, బస్టాండ్‌తో పాటు పార్కింగ్ స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడుపాయల జాతర ప్రశాంతంగా జరిగేందుకు 1200 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్చార్జి ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ రూరల్ సీఐ విజయ్, పాపన్నపేట, కొల్చారం, ఎస్సైలు విజయ్‌కుమార్, శ్రీనివాస్‌తో పాటు ఎస్సైలు సందీప్‌రెడ్డి, ఆంజనేయులు ఉన్నారు.