నర్సాపూర్, జూలై 5: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని నడిబొడ్డున ఎతైన కొండలు, ప్రకృతి ఒడిలో ఉన్న రాయారావు చెరువు సుందరీకరణకు మోక్షం లభించింది. నర్సాపూర్ రాయారావు చెరువు సుందరీకరణకు ప్రభుత్వం టూరిజం శాఖ నుంచి రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన జీవో కాపీని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇటీవల విడుదల చేశారు. నర్సాపూర్ రాయారావు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పలుసార్లు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చెరువు సుందరీరణతో పాటు బోటింగ్, వాకింగ్ ట్రాక్, లైటింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. తద్వారా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. రెండు కొండల మధ్య సహజసిద్ధ్దంగా,సౌందర్యంతో కూడిన రాయారావు చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అర్బన్ పార్కు, పలు ఆలయాలు ఉన్నాయి. రాయారావు చెరువు పర్యాటకంగా అభివృద్ధి చెందితే నర్సాపూర్ ఖ్యాతి పెరుగుతుంది. రాయారావు చెరువు సుందరీకరణకు కృషిచేసిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో రాయారావు చెరువు కట్ట వెడల్పు చేశారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, బెంచీలు ఏర్పాటు చేశారు. పట్టణ వాసులు ఉదయం, సాయంత్రం వేళ కట్టపై వాకింగ్ చేస్తున్నారు. సేద తీరుతున్నారు. రాయారావు చెరువు సుందరీకరణతో పరిసరాల్లో ఆహ్ల్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. చెరువును ఆనుకొని అర్బన్ ఫారెస్ట్ పార్కు ఉండటంతో శని,ఆదివారాల్లో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వస్తున్నారు. దీంతో సందర్శకుల తాకిడితో చెరువు ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకోనున్నది.
నర్సాపూర్ రాయారావు చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లాను. టూరిజం శాఖ మంజూరైన నిధులతో బోటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తాం. తద్వారా ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.
– సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే