అందోల్, జనవరి 24: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మండలాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రయాణం నరకప్రాయంగా మారింది. వర్షాకాలంలో రోడ్లపై ఏర్పడిన గుంతలు ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాల బారిన పడుతూ క్షతగాత్రులవుతున్నారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట- చింతకుంట రోడ్డు, సంగుపేట- ఇటిక్యాల, జోగిపేట -మాసాన్‌పల్లి, వట్పల్లి-గొరెకల్, పల్వట్ల- నిర్జేప్ల, మర్వెల్లి- ఖాదీరాబాద్, రాయికోడ్ -సిరూర్, అల్లాదుర్గం-మెటల్‌కుంట, వట్పల్లి-రాయిపల్లి, చౌటకూర్-పన్యాల, కొన్యాలతోపాటు మునిపల్లి మండలంలోని పలు గ్రామాల రోడ్లు పూర్తిగా దెబ్బతిని కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లన్నీ గుంతలుపడి ప్రయాణం నరకప్రాయంగా మారిందని పేర్కొంటున్నారు.
ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదని, రోడ్లకు మరమ్మతులు పక్కన పెడితే కనీసం గుంతలు పూడ్చే ప్రయత్నం చేయడం లేదంటున్నారు. ఏదైనా ఊరికి ప్రయాణం చేయాలన్నా…అత్యవసర సమయంలో దవాఖానకు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొంటున్నారు. గుంతలరోడ్లపై ఇప్పటికే జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది క్షతగాత్రులయ్యారని.. వాహనాల మరమ్మతులకు డబ్బులు ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
అధ్వానంగా రోడ్డు
అల్లాదుర్గం-మెట్కుంట, సిరూర్-రాయికోడ్ రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై జహీరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సాగించే వారు చుట్టూ తిరిగి సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వెళ్తున్నారు. సిరూర్ నుంచి రాయికోడ్ వరకు రెండేండ్ల క్రితం రోడ్డు తవ్వేశారు..కానీ ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. పనులు పూర్తికాకపోవడం, అధికారుల తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జోగిపేట-ముదిమానిక్యం రోడ్డు సైతం పూర్తిగా పాడైంది. కంకర, మట్టి తేలడంతో ప్రయాణాలకు ఏమాత్రం అనుకూలంగా లేకుండా పోయింది. గుంతలరోడ్డుపై ఇబ్బందులు పడుతుండగా…రోడ్లపై మట్టిలేస్తూ వాహనదారుల కండ్లల్లో పడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నారు. వట్పల్లి చౌరస్తా, రాయికోడ్ చౌరస్తాల వద్ద సైతం రోడ్ల వెడల్పుకోసం తవ్వినా “ఒక్క అడుగు ముందుకు ఆరు అడుగులు వెనక్కి” అన్నట్లు పనులు కొనసాగుతున్నాయి… దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.