న్యాల్కల్, జూన్ 13: కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు మరమ్మతు పనులు ఇవేనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు ఆదిలోనే ధ్వంసమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ సమీపం నుంచి రాంతీర్థం, గుంజోట్టి, వడ్డి, శంశోల్లాపూర్ మీదుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి వెళ్లే ఆర్అండ్బీ రోడ్డ మార్గంలో ఆయా గ్రామాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి.
ఈ రోడ్డు మార్గానికి మరమ్మతులు చేసి బాగు చేయాలని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు మొరపెట్టుకోగా, జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్టేట్ ఫండ్ కింద మరమ్మతులు చేపట్టడానికి రూ.1.43 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ మార్గంలోని గుంజోట్టి-వడ్డి గ్రామాల శివారుతోపాటు దెబ్బతిన్న పలుచోట్ల ఉన్న 3.6 కిలోమీటర్ల దూరం రోడ్డుకు మరమ్మతులు పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణ దశలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన రోడ్డు కొద్దిరోజుల్లోనే పాడైపోయింది.
దీంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు రోడ్ల పనులను పరిశీలిస్తే కాంట్రాక్టర్లు ఎంతటి శ్రద్ధ కనబరిచారో వెల్లడవుతుందన్నారు. రోడ్డు నిర్మాణంలో అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపట్టడంతో రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు. దీనికి తోడు ఈ మార్గంలో 20 టన్నుల లోడ్‌తో వెళ్లాల్సిన ఇసుక లారీలు 50-60 టన్నులతో వెళ్లడంతో రోడ్డు దెబ్బతింటున్నాయన్నారు.
ఇప్పటికైనా సం బంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్లను బాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఆర్అండ్బీ ఏఈ సంధ్య దృష్టికి తీసుకెళ్లాగా ఆయా గ్రామాల మధ్య నిర్మించిన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించి బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కెపాసిటీకి మంచి ఆధిక లోడ్‌తో ఇసుక లారీలు వెళ్తుండంతో రోడ్లు దెబ్బతింటున్నాయని, వాటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆయా గ్రామాల మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు, వాహన చోదకులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పేర్కొన్నారు.