సంగారెడ్డి, జూలై 20(నమస్తే తెలంగాణ): ఎల్‌నినోపై సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన సమీక్షా సమావేశం మొక్కుబడిగా సాగింది. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు, ఘనపురం ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నిధుల విడుదల తదితర అంశాలపై సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు.

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ జరగాల్సి ఉండగా, సమీక్షా సమావేశం కాస్తా రాజకీయాలకు వేదికగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు జిల్లా రైతుల ప్రయోజనాలు, ప్రజల తాగునీటి అవసరాలు, విద్యుత్ సమస్యలపై మంత్రి వివేక్, జిల్లా అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మం త్రి వివేక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మంత్రి వివేక్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్రం నిధులపై మంత్రి వివేక్ బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఘనపురం ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, సింగూరు నీళ్లు పూర్తిగా స్థానిక రైతులు, ప్రజల అవసరాలకు ఉపయోగించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు పట్టుబట్టారు. సమావేశం ప్రారంభంలోనే క్రాప్ హాలిడే ప్రకటన, ఇన్పుట్ సబ్సిడీ అంశంపై మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీతారెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఘనపురం ఆనకట్ట కింద రైతులు వరి సాగు చేశారని ఎల్‌నినో నేపథ్యంలో ఘనపురం ఆనకట్ట కింద క్రాప్‌హాలిడే ప్రకటించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాం డ్ చేశారు. మా ప్రభుత్వంలో రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని ఎల్‌నినో నేపథ్యంలో ఘనపురం కింద క్రాప్‌హాలిడే ప్రకటించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ప్రత్నామ్నాయ పంటలకు సంబంధించి సబ్సిడీపై విత్తనాలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సింగూరు కింద క్రాప్‌హాలిడే ఉన్నందున రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతాప్రభాకర్ కోరారు. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 4.5 టీఎంసీ జలాలు ఉన్నందున ఆ జలాలను పూర్తిగా సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టులోని జలాలను రిజర్వు చేయాలని, హైదరాబాద్ ఇతర జిల్లాలకు తరలించవద్దని కోరారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ సింగూరు జలాల అంశంపై ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, బోర్లు వేసేందుకు అదనంగా నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

నర్సాపూర్, మెదక్‌లో పంటలను కోతులు దెబ్బతీస్తున్నాయని, కోతల బెడద తగ్గేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి వివేక్ స్పందిస్తూ కోతుల బెడద తగ్గించేందుకు ప్రత్యేకంగా బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని మెదక్ కలెక్టర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీరు సమస్య పరిష్కరించాలని, అదనపు బోర్లు వేయాలని, కరెంట్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడారు. సంగారెడ్డి, సదాశివపేటకి మంజూరైన నాలుగు సబ్స్టేషన్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదాశివపేట, సంగారెడ్డి పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జహీరాబాద్‌లో రైతులు చెరుకు స్థానంలో ఇతర పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు సూచించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సింగూరు జలాలను పూర్తిగా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎల్‌నినో నుంచి రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యం త్రాంగం సమష్టి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ సూచించారు ప్రభుత్వం ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని వరి సాగు చేయవద్దని సూచించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ సాగు చేయాలని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. అయిల్‌పామ్ సాగు విషయంలో సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా తీసుకుని రెండు జిల్లాల్లో అమలు చేయాలని హార్టికల్చర్ అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని అధికారులకు తెలిపారు. వ్యవసాయ, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎల్‌నినో ద్వారా రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
ఎల్‌నినో సమీక్షా సమావేశంలో ఇన్చార్జి మంత్రి వివేక్, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అమృత్ స్కీమ్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద నిధులు మంజూ రు చేయడంలేదని, అందుకే పనుల్లో జాప్యం జరుగుతున్నదన్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చొరవ తీసుకోవాలని సూచించారు. దీనిపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా అమృత్ స్కీమ్ ద్వారా నిధులు ఇస్తున్నదన్నారు. అమృత్ స్కీమ్ పనుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమని, అమృత్స్కీమ్కు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కేంద్రం ఇవ్వడం లేదంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి అమృత్ పనులు త్వరగా అయ్యేలా చూడాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లకు సూచించారు.

ఓవైపు సమీక్షా సమావేశం జరుగుతుండగా మరోవైపు పలువురు అధికారులు నిద్రలోకి జారుకుని కనిపించారు. సమీక్ష జరుగుతున్న సమయంలోనే పలువురు అధికారులు కునుకు తీశారు. మరికొంత మంది అధికారులు ఓవైపు మంత్రి మాట్లాడుతుండగానే ఫోన్లో మాట్లాడుతూ గడిపారు. ఈ సమావేశంలో సీట్లు లేక పలువురు అధికారులు నిల్చు న్నారు. సమావేశంలో ప్రత్యేకాధికారి వాణీప్రసాద్, కలెక్టర్లు ప్రతీక్‌జైన్, ప్రతిమసింగ్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, మెంచు నగేశ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పాల్గొన్నారు.