జహీరాబాద్ : నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జహీరాబాద్ -బీదర్ ( Zahirabad- Bidar ) ప్రధాన రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా మారిన గుంతలను హద్నూర్ ఎస్సై ప్రత్యేక చొరవ తీసుకొని పూడ్చివేశారు. ఈనెల 6న రద్దీ రోడ్డు..గుంతలతో బేజారు అనే వార్త శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైంది.

దీంతో హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని సిబ్బందితో కలిసి శుక్రవారం న్యాల్కల్ మండలం ఖలీల్ పూర్ గ్రామ శివారులోని నారింజ వాగు ప్రాజెక్టు నుంచి ఖలీల్ పూర్, మిర్జాపూర్, గంగ్వార్ గ్రామ శివారు గుండా వెళ్లే బీదర్ -జహీరాబాద్ ప్రధాన రోడ్డుపై గుంతలను పూడ్చివేశారు.
ఈ రోడ్డు మార్గంలో వందలాది వాహన చోదకులు, ప్రజల రాకపోకలు కొనసాగుతుండడంతో పలువురు ప్రమాదకరంగా మారిన గుంతల గుండా వెళ్లి మృత్యువాత పడడమే కాకుండా తీవ్ర గాయాల బారిన పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ జడ్పీటీసీ శారద భాస్కర్ రెడ్డి సహకారంతో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చి వేయడంతో ఎస్సైను ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు అభినందనలు తెలిపారు.