పటాన్చెరు, ఏప్రిల్ 24: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన ఉద్యోగానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్యా విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో డాక్టర్ దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సెనరీ.? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ప్రచురించిన ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కౌటిల్యాలో విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ అయిన సుబ్బారావు 2008 నుంచి 2013 వరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు గవర్నర్‌గా పనిచేశారు.
అంతకు ముందు భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుడిగా అత్యున్నతమైన ఉద్యోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు తన కెరీర్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన, శ్రద్ధాసక్తులతో కూడిన కథనాన్ని అందించడమే కాకుండా, యువ నిపుణులకు వారి సొంత వృత్తిలో రాణించడానికి మార్గదర్శనం చేసేలా, యువతను ప్రేరేపించేలా రాసినట్లు వివరించారు. చిన్నప్పటి నుంచే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. వివిధ శాఖల్లో పలు హోదాల్లో పనిచేసిన అనుభవం నుంచి రాసిన పుస్తకాలు రేపటి తరానికి ఉపయోగపడుతాయని తెలియజేశారు.
జిల్లాస్థాయి నియామకాల నుంచి భారతదేశ బ్యూరోక్రాటిక్ ఫ్రేమ్‌వర్క్ వరకు జరిగిన పరిణామక్రమం, పౌరసేవల్లో లింగసమానత్వం వంటి పలు ఆసక్తికర అంశాలను స్పృశించిన ట్లు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్‌లో రాణించేందుకు ఆయన పలు సలహాలు అందజేశారు. గత యాభై ఏండ్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అనేక రంగాల్లో దేశం ముందుకు పయనించిందన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం రావడంతో అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో వేగం వచ్చిందన్నారు. బ్యూరోక్రాట్స్గా కేవలం వీడియో కాలింగ్స్, సమావేశాలతోనే విషయ పరిజ్ఞానం రాదన్నారు.
చాలా విషయాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అన్ని సవ్యంగా ఉంటేనే అధికారులు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. చివరిగా తన తల్లికి రాసిన లేఖను పుస్తకంలో అచ్చువేసి ఆ అక్షర అనుభూతిని స్వయంగా ఆయన చదివి వినిపించారు. కౌటిల్యా విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇండిపెండెంట్, మల్టీమీడియా జర్నలిస్టు స్మితాశర్మ డాక్టర్ సుబ్బారావుతో ముఖాముఖి నిర్వహించారు. కౌటిల్యా విద్యార్థులు ప్రశ్నలు అడిగి సుబ్బారావు నుంచి సమాధానాలు రాబట్టారు. డాక్టర్ సుబ్బారావు ఇచ్చిన అనుభవపూర్వకమైన సమాధానాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసి డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.