పటాన్చెరు, ఫిబ్రవరి 12 : ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం ‘ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్ర్తాల్లో సమగ్ర ధోరణులు’ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఆకెళ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆరోగ్యరంగం అభివృద్ధి చెందితేనే రోగా ల నుంచి ప్రజలను రక్షించవచ్చన్నారు. ఆరోగ్యరంగంలో తగిన పెట్టుబడులు ఎంతై నా అవసరమని, ప్రజారోగ్యం మెరుగుపర్చేందుకు, అసమానతలు తగ్గించడం వంటి దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
నూతన ఆవిష్కరణలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు దో హదం చేస్తున్నట్లు చెప్పారు. వైద్యరంగానికి అం తంతమాత్రం కేటాయింపులు, రాజకీయ సంక్షోభాలు, మౌలిక సదుపాయా లేమి, అన్ స్కిల్డ్ శ్రామిక శక్తి వంటి సవాళ్లను వైద్యరంగానికి సవాలుగా మారినట్లు తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ హెల్త్ కేర్, టెలీమెడిసిన్, వ్యక్తిగతీకరించిన వైద్యం వంటి వినూత్న పరిష్కారాలతో మెరుగైన వైద్యసేవలు అం దించవచ్చని ఆకెళ్ల వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి పౌరుడికి సరైన వైద్యం, మందులు అందినప్పుడే ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యమన్నారు. సీడీఎస్ సీవో హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్‌కిషన్ మాట్లాడుతూ..
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 7,129 వ్యాధులు గుర్తించారని, వాటిలో 85 అతి ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ఆరోగ్య సంస్కరణలు, క్లినికల్ ట్రయల్స్, పరిశోధనల్లో ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సదస్సులో ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరన్ దాస్, వీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు, డాక్టర్ రెడ్డీస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పరిమల్ మిశ్రా, హైదరాబాద్ నైపర్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నండూరి, పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వినోద్‌కుమార్, క్రోయోషియాలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త డాక్టర్ జురికా నోవాక్, నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.