
గజ్వేల్, జనవరి 1: గజ్వేల్ పట్టణం మధ్య నుంచే రీజినల్ రింగురోడ్డు నిర్మాణం జరుగుతుందన్న ఊహాజనిత వార్తల రోడ్డు భవనాల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) రవీందర్రావు చెక్పెట్టారు. పలు జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న రీజినల్ రింగురోడ్డు ఉత్తరభాగం గజ్వేల్ పట్టణం బయటి నుంచే జరుగుతుందని స్పష్టం చేశారు. గజ్వేల్ పట్టణం బయటి నుంచి హైదరాబాద్ మార్గాన్ని అనుసరిస్తూ ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నట్లు తేల్చారు. గజ్వేల్ పట్టణంలో గతేడాది నుంచి రీజినల్ రింగురోడ్డు గురించి నానా రకాలుగా ఊహాగానాలు, వార్తలు వస్తుండగా, ఈఎన్సీ వాటిని కొట్టిపారేశారు. ఏడాదిలో రీజినల్ రింగురోడ్డు పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నా రు. శనివారం గజ్వేల్-చేగుంట రహదారిని బిట్స్ పిలానీ ప్రొఫెసర్ శ్రీధర్ రాజు, రీసెర్చ్ స్కాలర్లు భానుప్రసాద్, వినీష, గజ్వేల్ డీఈఈ బాలప్రసాద్తో కలిసి పరిశీలించారు. ఈ మార్గంలో రహదారిపై అక్కడక్కడ దెబ్బతినడానికి గల కారణాలు, మరిన్ని అంశాలు గుర్తించడానికి రాజస్థాన్ నుంచి ఫాలింగ్ వెయిట్ డిఫ్లెక్టో మీటర్ యంత్రాన్ని తీసుకొచ్చి పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రీజినల్ రింగురోడ్డులో ఉత్తరభాగం నిర్మాణానికి అధికారులు నాలుగు అలైన్మెంట్లను పరిశీలనకు అందజేయగా, ఢిల్లీలోని కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యాలయం తక్కువ దూరం తోపాటు తక్కు వ ఖర్చు అయ్యేలా ఉన్న అలైన్మెంట్ ‘ఏ’ను ఖరారు చేసిందన్నారు.
ఇప్పటివరకు ప్రిలిమినరీ సర్వే పూర్తి చేసి అలైన్మెంట్లను ఖరారు చేయగా, కేంద్రం ఆమోదంతో ఫొటోగ్రాఫిక్ తదితర నిర్ధిష్ట సర్వేలన్నీంటినీ పూర్తి చేసి, రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి తుది ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసే పనిలో తెలంగాణ ఇంజినీర్లు తలమునకలై ఉన్నారన్నారు. సర్వేలతో పాటు డిజైన్తయారీకి కూడా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా తొలి విడుతలో 180 కిలోమీటర్ల మేరకు ఈ రీజినల్ రింగురోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఈఎన్సీ తెలిపారు. భూసేకరణ కోసం ప్రత్యేకంగా డివిజన్, సబ్డివిజన్లుగా ఏర్పాటు చేసి, ఆర్డీవో స్థాయి అధికారులతో భూసేకరణ చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందన్నారు. మరో నాలుగైదు నెలల్లో భూసర్వే పూర్తవుతుందని, వెంటనే ఆరునెలల్లో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి ఏడాదిలోపే రీజినల్ రింగురోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఐదింతలు పెరిగిన వాహనాల రాకపోకలు
గజ్వేల్-చేగుంట మార్గం విస్తరించడంతో ఐదింతలు వాహనాల రాకపోకలు పెరిగాయని ఈఎన్సీ అన్నారు. గజ్వేల్-చేగుంట మార్గం ని ర్మించిన ప్రమాణాలతోనే రాష్ట్రవ్యాప్తంగా 4200 కిలో మీటర్ల రహదారులు నిర్మించారన్నారు. కానీ, గజ్వేల్-చేగుంట మార్గం విశా లంగా నిర్మించిన తర్వాత, గజ్వేల్-తూప్రాన్ మార్గంతోపాటు గజ్వేల్-రామాయంపేట మార్గంలోని వాహనాలన్నీ ఇదే రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. గతం కన్నా 5 రెట్లు ఎక్కు వగా ఈ మార్గంలో వాహనాలు ప్రయాణించడంతో అక్కడక్కడ రోడ్డు దెబ్బతిన్నదన్నారు. అందుకే ఈ రోడ్డులోని ఆయా ప్రదేశాల పరి శీలించి అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని బిట్స్ పిలానీ ప్రొఫెసర్ శ్రీధర్ రాజును కోరామని, అందుకే ఆయన రీసెర్స్ స్కా లర్లతో ఇక్కడికి వచ్చారన్నారు. ప్రొఫెసర్ శ్రీధర్ రాజు మాట్లా డుతూ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రోడ్డు సమస్యను ఈఎన్సీ తమ దృష్టికి తెచ్చి, కారణాలు, తక్కువ ఖర్చుతో మరమ్మతుల కోసం సలహాలివ్వాలని కోరారన్నారు. అందుకే తాము వచ్చామ న్నారు. త్వరగా ఈ యంత్రం ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి రోడ్డు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఈఎన్సీ రవీందర్రావు తెలిపారు.