ఈ వానకాలంలో సోయాబీన్ సాగుచేసి నష్టపోయాం. పెట్టిన పెట్టుబడి, రెక్కల కష్టం అంతా వృథా అయ్యింది. కోతకు వచ్చే సమయంలో అధిక వర్షాలు, సింగూరు బ్యాక్‌వాటర్‌లో సోయా నీట మునిగి నష్టపోయాం. ఈసారి నాలుగు ఎకరాల్లో సాగు చేసిన సోయా పంట బ్యాక్‌వాటర్‌లో మునిగి పాడైపోయింది. దాదాపు రూ. 1.50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలి
– వైజ్యనాథ్, రైతు, అమీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)
జహీరాబాద్, అక్టోబర్ 14: సోయా రైతుకు ఈసారి నష్టాలే మిగిలేలా ఉన్నాయి. అధిక వర్షం, తెగుళ్లు, చీడపీడల బెడద ఈసారి సోయాబీన్ పంటను బాగా దెబ్బతీశాయి. తక్కవ పెట్టుబడితో సాగుచేసే అవకాశం ఉండడంతో ఈ వానకాలంలో సోయా సాగువైపు సంగారెడ్డి జిల్లా రైతులు దృష్టిసారించారు. ఈసారి దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు సుమారుగా 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, 4 నుంచి 7 క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో 42,330 ఎకరాల్లో సోయాబీన్ పంటను రైతులు సాగుచేశారు. విత్తనం విత్త్తిన తర్వాత 20 రోజుల పాటు వర్షాల జాడలేకుండా పోయింది. ఆ తర్వాత కురిసిన వర్షాలకు పంట ఏపుగా పెరిగింది. పూత, కాత సమయంలో అధిక వర్షాల కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వారం నుంచి సోయా పంట నూర్పిళ్లు చురుగ్గా జరుగుతున్నాయి. కొందరు రైతులు నేరుగా హర్వేస్టర్లతో, మరి కొందరు రైతులు కోత కోసి కుప్ప వేసి నూర్పిడి చేస్తున్నారు. ఎకరానికి 4 నుంచి 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవు
సోయా పంట జూన్ చివరిలో విత్తుతారు. 100 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి ఎరువులు అవసరం లేకుండా తక్కువ నీటితో పంట సాగు చేయవచ్చు. కానీ, ఈ వానకాలంలో అధిక వర్షాలు కురవడం, పంటపొలాల్లో నీరు నిల్వడంతో పాటు సింగూర్ బ్యాక్‌వాటర్‌లో మునిగిపోవడం, తెగుళ్లు, చీడపురుగుల ఆశించడంతో పంటను తీవ్రంగా దెబ్బతిశాయి. సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికి పంటకు ఆశించిన తెగుళ్లు, అధిక వర్షాల ప్రభావంతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు ఎంత లేదన్నా దాదాపు రూ.15 నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టినట్టు రైతులు తెలిపారు.
కనీనం పెట్టుబడి కూడా చేతికి వచ్చేలా లేదని వాపోతున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సోయాను కోత కోసేందుకు కూలీలు దొరకడం లేదు. సోయా పంటను నమ్ముకున్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల ఆర్థిక భారాన్ని భరించడం తప్ప చేసేదిమీలేదని, కూలీలు డిమాండ్ మేరకు కూలీ డబ్బులు చెల్లించి పంటను కోత కోయాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. పొలంలో నుంచి కోత కోసి సోయా బయటకు తెచ్చి కుప్పలు నిల్వచేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తర్వాత కూడా సోయాను నూర్పిడి చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.
ఈసారి సోయా పంటకు 5,328 మద్దతు ధర ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఊసెత్తడం లేదు. ఫలితంగా రైతులు ఇండ్ల ఎదుట, పంట పొలాలు, ఖాళీ స్థలాల్లో ఆరబోస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాన్నీ బాధలు భరించి రైతులు రాసులు చేసిన తర్వాత జహీరాబాద్, బీదర్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆయా మార్కెట్లలో వ్యాపారులు క్వింటాల్‌కు రూ. 3,000 నుంచి 4,300 వరకు కొనుగోలు చేస్తున్నారు. విత్తనం విత్తడం నుంచి తెగుళ్లు నివారించేందుకు మందులు పిచికారీ, కలుపు తీయడం, యంత్రాల ఖర్చులైనా చేతికి వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు. ప్రకృతి దెబ్బతీయడంతో దిగుబడి తగ్గి నష్టపోతే, మార్కెట్లో కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు సోయా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.