గజ్వేల్, జూన్ 19: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో గజ్వేల్, వంటిమామిడి, కొండపాక, తూప్రాన్ మండలాల్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నారు. ఇటీవల ఆయా మార్కెట్ కమిటీలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, డైరెక్టర్ల నియామకం కోసం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కొంతమంది పేర్లను జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖకు అందజేసినట్లు తెలిసింది. గజ్వేల్ ఏఎంసీ పదవి కోసం జగదేవ్‌పూర్ మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధికి కట్టబెడుతున్నట్లు తెలిసి గజ్వేల్‌కు చెందిన సీనియర్ నాయకులు నిరుత్సాహంతో రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేశామని కోరుతూ మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు ఆధ్వర్యంలో పీసీసీ ప్రచార కార్యదర్శి నాయిని యాదగిరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ భానుప్రసాద్‌రావు వినతిపత్రం అందజేసి తమకు ఏఎంసీ పదవి ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం గజ్వేల్ కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌రావు రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. పార్టీ పరువు బజారున పడేశారు అంటూ అదే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి గజ్వేల్‌లో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా ఉన్నప్పటికీ పార్టీ పెద్దలు ఏమా త్రం పట్టించుకోలేదని కార్యకర్తలు వాపోతున్నారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పుట్టినరోజు వేడుకలను బుధవారం గజ్వేల్‌లో కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌లకు చెందిన నాయకులు గ్రూపులుగా విడిపోయి పూజలు చేసిన అనంతరం కేక్‌కట్ చేసి అన్నదానం చేశారు. రెండు గ్రూపులుగా రాహుల్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పార్టీలో గ్రూపులు బయటపడ్డాయి. ఇందిరాపార్కు చౌరస్తాలో ఓ వర్గం నేతలు కేక్‌కట్ చేసి అన్నదానం చేయగా మరో వర్గం నేతలు కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్‌కట్ చేశారు. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గజ్వేల్ కాంగ్రెస్ నేతలు అవలంబిస్తున్న తీరుతో కార్యకర్తల్లోనే అసహనం వ్యక్తమవుతున్నది.