ఖైరతాబాద్, డిసెంబర్ 11: ముంపులో కోల్పోయిన తమ స్థలాలను రక్షించాలని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్దచెరువు ముంపు బాధితులు డి మాండ్ చేశారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధ వద్ద ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ150 ఏండ్ల క్రితం నాటి అవసరాల కోసం నిజాం ప్రభుత్వం 93 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువును నిర్మించారన్నారు.
స్థానిక రైతుల వ్యవసాయ అవసరాలతో పాటు అక్కడి ప్రజలకు ఆధారంగా నిలిచిన ఈ చెరువు అలుగును మూసివేయడంతో భూములన్నీ ముంపునకు గురయ్యాయన్నారు. 20 లేఅవుట్స్‌లోని స్థలాలు కోల్పోయామని, ఈ విషయంలో తమకు న్యాయం చేయమని కోరితే ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిపై ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ధర్మకు వినతి పత్రం అందజేయగా, సానుకూలంగా స్పందించి తమకు న్యాయం జరిగే విధంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో సం జయ్‌కుమార్, సత్యమూర్తి, విజయ్‌కుమార్, టీవీ రావు, సుబ్రహ్మణ్యం, నాగభూషణరావు, మల్లారెడ్డి, జీవ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.