న్యాల్కల్, జూన్ 19 : కూరగాయల ధరలు కొండెక్కాయి. కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నెల రోజుల్లో టమాట నాలుగు రెట్లు పెరగ్గా, మిగతా కూరలు 40నుంచి 50శాతం పెరిగాయి. పచ్చిమిర్చి ముట్టుకుంటే ఘాటెక్కుతున్నది. టమాట నేడోరేపో సెంచరీ కొట్టనున్నది. మేమేం తక్కువ అన్నట్టు అన్ని కూరగాయల ధరలు వాటి వెంటే కొండెక్కి కూర్చున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం డబుల్ అవడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్కు ఐదు వందల నోటుతో వెళ్లితే.. సగం సంచి కూడా నిండడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో కిలో కొనేవారు, పావుకిలో సరిపెట్టుకుంటున్నారు. కూరగాయల సాగు తగ్గిపోవడం, వర్షాలతో తోటలు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది. మార్కెట్కు ఎక్కవగా దిగుబడి వస్తే ధరలు అదుపులోకి వస్తాయని వ్యాపారులు అంటున్నారు. బహిరంగ మార్కెట్లో కంటే ఎంతో కొంత తక్కవ ధరలకు లభిస్తాయనుకుని రైతుబజారుల్లో సైతం ధరలు ఎక్కవగానే ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండించే రైతుకు ఎంత వరకు గిట్టుబాటు ధర లభిస్తోందో గానీ.. దళారులు మాత్రం బాగుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాన్యుడు రూ.500 తీసుకుని మార్కెట్కు వెళ్తే పట్టుమని నాలుగు రకాల కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. పచ్చిమిర్చి ధర రూ.100-120 చేరి అందనంత ఎత్తులో ఉంది. జహీరాబాద్, బీదర్ పట్టణాల్లో కాకుండా మండలంలోని వారంతపు సంతలు, వీధి దుకాణాల్లో సైతం కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితం టమోట ధర రూ.10 నుంచి 20 ఉండగా నేడు ఏకంగా రూ.70 నుంచి 90 వరకు చేరింది. నిత్యం కూరల్లో ఉపయోగించే ఉల్లిపాయలు కూడా గతంలో రూ.25 ఉండగా నేడు ఒక్కసారిగా రూ.60కి మార్కెట్లో విక్రయిస్తున్నారు. బీరకాయ, గోరుచిక్కుడు, వంకయ, కాకర కాయ, చిక్కుడు, బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, బీన్స్, ముల్లంగి తదితర కూరగాయల ధరలు రూ.80-100 మధ్య ఉండడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివని వైద్యులు చెప్పడంతో వాడి ధరలు కూడా పెరిగిపోవడంతో కొనలేకపోతున్నారు. మెంతి, పాలకూర, చుక్కకూర, గోంగూర వంటివి కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆదివారం వస్తే మాంసంలోకి కచ్చితంగా వాడే పుదీనా, కొత్తిమీర, అల్లం వంటివి కూడా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యలు కొనాలంటే ఆందోళనకు గురవుతున్నారు. కూరగాయలు, ఆకుకూరల ధరల గురించి వ్యాపారులను అడిగితే పంటలు పండడం లేదనే సాకుతో మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పి సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ధరల నియంత్రించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మార్కెట్లోనే కాదు.. వారాంతపు సంతలో కూడా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. వాటిని కొనాలంటేనే భయమేస్తోంది. గతం లో ఎప్పుడు లేని విధంగా వ్యాపారులు కూరగాయల ధరలు పెంచేశారు. ఏ కూరగాయలను కొని తినే పరిస్థితుల్లో లేం. నోటికి రుచికరంగా చేసుకుందా మంటే ధరలు మండిపోతున్నాయి. రూ.500 తీసుకుని వెళితే సగం సంచి కూడా నిండడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలపై ప్రభు త్వం తగు చర్యలు తీసుకుని నియంత్రించాలి. – శంభునోల నర్సారెడ్డి, హద్నూర్,
న్యాల్కల్ మండలం