మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన.. 40 ఏండ్ల రికార్డు బ్రేక్
రోడ్లకు భారీగా డ్యామేజ్
మెదక్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు 60 రోడ్లు దెబ్బతిన్నాయని పీఆర్ ఈఈ నర్సింలు తెలిపారు. రూ.3.99 కోట్లతో మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. హవేళీఘనపూర్ మండలం బ్యాతోల్-లింగ్సాన్పల్లి రోడ్డు, మెదక్ నుంచి మక్తభూపతిపూర్ రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకు పోయిందన్నారు. మెదక్ మండలం పాతూర్- రాయిన్పల్లి వెళ్లే రోడ్డు ధ్వంసమైనట్టు తెలిపారు.
మెదక్ జిల్లాలో 6341 ఎకరాల్లో పంట నష్టం…
మెదక్ జిల్లాలో సుమారు 3 లక్షల వరకు వివిధ పంటలు సాగు చేశారు. వర్షాలకు జిల్లాలోని 21 మండలాల్లో 6341 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయని వ్యవసాయశాఖ అధికారి దేవకుమార్ తెలిపారు. పంటల నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశామని, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటారని చెప్పారు.
మెదక్ జిల్లాలో 2632 నిండిన చెరువులు…
మెదక్ జిల్లాలో 2632 చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఘనపూర్, హల్దీ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులకు, వాగులు, వంకలకు గండ్లు పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్ జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం…
రెండు రోజులుగా మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా సరాసరి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హవేళీఘణాపూర్ మండలం సర్ధనలో 31 సెంటీ మీటర్లు, అత్యల్పంగా మనోహరాబాద్ మండలంలో 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హవేళీఘణాపూర్ మండలం నాగాపూర్లో 27 సెంటీ మీటర్లు, చేగుంట మండలంలో 23 సెంటీ మీటర్లు, రామాయంపేటలో 21 సెంటీ మీటర్లు, మెదక్లో 21 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 16 సెంటీ మీటర్లు, వెల్దుర్తి మండలం దామరంచలో 15 సెంటీ మీటర్లు, నార్సింగి మండలంలో 14 సెంటీ మీటర్లు, పెద్దశంకరంపేటలో 13 సెంటీ మీటర్లు, టేక్మాల్ మండలంలో 12 సెంటీ మీటర్లు, మాసాయిపేట మండలంలో11 సెంటీ మీటర్లు, చిలిపిఛేడ్ మండలంలో 11 సెంటీ మీటర్లు, కౌడిపల్లి మండలంలో
8 సెంటీ మీటర్లు, నర్సాపూర్ మండలంలో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.