న్యాల్కల్, జూలై 14: రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. గ్రామాల్లో రోడ్డు, రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేస్తోంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చాల్కి, చీకూర్తి, హుస్సేన్‌నగర్ మీదుగా కర్ణాటకకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అధ్వానంగా మారిన రోడ్డు మరమ్మతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేట్ ఫండ్ కింద రూ. 1.52 కోట్లు మంజూరు చేసింది. సం బంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయా గ్రామాల మీదుగా వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుకు మరమ్మతులు పనులు చేపట్టడం లేదు.
రోడ్డుపై బీటీ కోతకు గురై గుంతలుపడి కంకర తేలింది. మోకాళ్లలోతు గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ రోడ్డు వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో రోడ్డు మార్గంగుండా వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. రోడ్డు మరమ్మతుల కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సం బంధిత అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జి ల్లా అధికారులు స్పందించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.