సంగారెడ్డి, జూన్ 5: భూ తగాదాల్లో యజమానులను బెదిరించి భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవారం మునిపల్లి మండలం ఖమ్మంపల్లి శివారులో భూ యజమానిని బెదిరించిన పదిమందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మునిపల్లి, కొండాపూర్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ యజమానులను బెదిరించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిరాయి గూండాలతో భయభ్రాంతులకు గురిచేసే విధంగా తళ్వార్లు, కత్తులు, కట్టెలతో దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
ఖమ్మంపల్లి గ్రామ శివారులో 198, 251 సర్వేనంబర్లలో హైదరాబాద్‌కు చెందిన పెండ్యాల హరినాథ్‌బాబుకు వంద ఎకరాల భూమి ని ఇప్పిస్తానని ఆత్రియ స్మార్ట్ రియల్ కంపెనీకి చెందిన గణపతిరాజు శ్రావణ్ వర్మ అలియాస్ శ్రావ ణ్, గట్టుముక్కల భారత్ వర్మ, అశోక్‌రెడ్డి, పాషా అనే నలుగురు వ్యక్తులు నమ్మించారు. వంద ఎకరాలకు బదులు 70 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసి ఇచ్చారు. మరో 10 ఎకరాల భూమి డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు హరినాథ్‌బాబుకు తెలిసింది. దీంతో మోసం చేస్తునట్లు గుర్తించి మునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిపై దాడి చేసి, కిరాయి గూండాలతో ఆ భూమిలో ఉన్న ఫెన్సింగ్ కడీలను ధ్వంసం చేశారు. పనివారిపై కూడా దాడు లు చేశారు. భూ యజమానిని భయభ్రాంతులకు గురిచేసిన గూండాలతోపాటు ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని ఎస్పీ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ్‌రావు, ఇన్స్పెక్టర్లు మహేశ్‌గౌడ్, చంద్రయ్య, మునిపల్లి ఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు.