మునిపల్లి, అక్టోబర్ 13: వాహనాల తనిఖీల్లో అనుమతులు లేని మద్యం, ఆధారాలు లేని నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శుక్రవారం మండల పరిధిలోని కంకోల్ శివారులో ముంబాయి జాతీయ రహదారిపై డెక్కన్ టోల్‌ప్లాజా వద్ద అసిస్టెంట్ కమిషనర్ కె.రఘురాం, మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆదేశాల ప్రకారం ఈ తనిఖీలు చేపట్టామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
వాహనాల తనిఖీల్లో వివిధ విభాగాల్లో మూడు కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అనుమతులు లేకుండా మద్యం బాటిళ్లు తరలిస్తే ఎంతటివారైనా సహించేదిలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రూ.50వేల కంటే ఎక్కువ వాహనంలో ఉండరాదన్నారు. కంకోల్ టోల్‌ప్లాజా వద్ద నమోదైన కేసులు గురించి వివరిస్తూ కర్ణాటకకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న మహిపాల్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.4,43,000లను స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారులకు అప్పగించినట్లు తెలిపారు. టెంపో ట్రావెల్స్ వాహనంలో వివిధ రకాల సుంకం చెల్లించని, గోవా రాష్ర్టానికి చెందిన (41 బాటిళ్లు) 45.7 లీటర్ల మద్యంతో పాటు వాహనంలో ఉన్న 13మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
వాహనంలో పట్టుబడ్డ వారంతా కరీంనగర్‌కు చెందిన వాళ్లుగా గుర్తించినట్లు తెలిపారు. కర్ణాటక బస్సులో ప్రయణిస్తున్న రాజప్పా అనే వ్యక్తి నుంచి 10.180 మిల్లీలీటర్ల పరిమాణం గల కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల తనిఖీల్లో మొత్తం లక్ష విలువ చేసే మద్యం, రూ.15లక్షల 43వేల నగదు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు మోహన్ కుమార్, రమేశ్‌రెడ్డి, మధుబాబు, ఎస్సైలు అనిల్ కుమార్, స్వాతి, పృత్వీరాజ్, విశ్వనాథ్‌తోపాటు సిబ్బంది ఉన్నారు.