జహీరాబాద్, జనవరి 16: సంగారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని బీదర్ జిల్లాకేంద్రంలో గురువారం పట్టపగలు ఇద్దరు దుండగులు సీఎంఎస్ సిబ్బందిపై జరిపిన కాల్పుల ఘటనలో ఒకరు మృతిచెందడం, ముగ్గురు గాయపడడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇరు రాష్ర్టాల పోలీసులు అలర్ట్ అయ్యారు. బీదర్‌లోని శివాజీ సర్కిల్లోని జిల్లాకోర్టు సమీపంలోని బ్యాంకు నుంచి డబ్బులను తీసుకుని సీఎంఎస్ సిబ్బంది తమ వాహనంలో ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు దుండగులు తలకు హెల్మెట్లు ధరించి బైక్‌పై వచ్చి సెక్యూరిటీతో పాటు డ్రైవర్ ముఖాలపై కారం పౌడర్‌ను చల్లారు. మరో ఇద్దరు సిబ్బం ది ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వాహనంలోని డబ్బులు భద్రపరిచిన పెట్టెను తీసుకెళ్తుండగా, దుండగులు విచక్షరహితంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
దీంతో సిబ్బంది ఒకరు వాహనం వెనక అక్కడికక్కడే మృతిచెందాడు. మరొక సిబ్బందిపై దుండగులు ఛాతిలో కాల్చడంతో స్పృహ తప్పిపోయాడు. వందలాది మంది ప్రజలు చూస్తుండగానే డబ్బులు భద్రపర్చిన పెట్టెను తీసుకుని దుండగులు బైక్‌పై పారిపోయారు. అక్కడే ఉన్న కొందరు వారిని రాళ్లతో కొట్టేందుకు ప్రయత్నించగా దుండగులు పిస్టల్‌తో బెదిరించడంతో పట్టుకునేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ ఘటనలో కోటి రూపాయల వరకు డబ్బులు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా తెలిసింది. దుండగుల కాల్పుల్లో తీవ్రగాయాలైన సిబ్బందిని బీదర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇందులో పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కేర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు మృతిచెందా రు. విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీసు అధికారులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపులో నిమగ్నమయ్యాయి. బీదర్ సరిహద్దున కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కర్ణాటక పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ నేతృత్వంలో జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. చిరాగ్పల్లి, హద్నూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మాడ్గి, గణేశ్‌పూర్, చెక్‌పోస్టులతో పాటు జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఆల్గోల్బైపాస్, దిగ్వాల్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నారు.