దుబ్బాక, అక్టోబర్ 19 : తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు ఉంది దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత వాటిని విస్మరించాడు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఊరికి వెళ్లినా ఆయనకు చుక్కెదురు తప్పడం లేదు. రఘనందన్‌రావు వారం రోజలుగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మూడేండ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోవడంతో పాటు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు. గురువారం దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండలంలో వీరానగర్, రాంసాగర్ గ్రామాల్లో రఘునందన్ ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామాల ప్రజలు, మహిళలు ఆయనను అడ్డుకున్నారు. వీరానగర్‌లో గ్రామస్తులు చుక్కలు చూపెట్టారు. గత ఉప ఎన్నికల హామీలు ఏమయ్యాయి..? మళ్లీ మా గ్రామానికి ఎందుకొచ్చావంటూ ఆ గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు.
నిరుద్యోగ యువతకు భృతి, రైతులకు జోడేడ్ల నాగలి, నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి దుబ్బాకలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తానంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ప్రత్యేక నిధులు తెచ్చి తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని, మోసగించావంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో బీజేపీ ప్రచారం నిర్వహించవద్దని గ్రామస్తులు అడ్డుకున్నారు. చేసేదేమిలేక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని వెళ్లిపోయారు. అనంతరం రాంసాగర్ గ్రామానికి ఆయన వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓట్ల కోసం తప్పా బీజేపీ నాయకులకు అభివృద్ధి సోయి లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఎమ్మెల్యే చేసిన ఒక్క అభివృద్ధి పనైనా ఉందా అని ప్రశ్నించారు. పది రోజుల కిందట దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్‌రావు చీరలు, గొడుగులు పంపిణీ చేశారు.
ఈ విషయంపై రాంసాగర్‌కు చెందిన మహిళలు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. గ్రామాల్లో బీజేపీ నాయకులు చీరలు పంచి తమ ఇండ్లలో గొడవలకు దారి తీశారంటూ కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలు పంచాల్సిన అవసరం ఏముంది అంటూ నిలదీశారు. మీ చీరలకు ఆశపడి బీజేపీకి ఓట్ల వేయ్యాలా అని మరికొందరు మహిళలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ గ్రామంలో సైతం ప్రచారం అర్ధంతరంగా ముగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండు రోజుల కిందట ఇందుప్రియాల్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులను బస్ సౌకర్యం కోసం ఆ గ్రామ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లారు. కనీసం ఓటు హక్కు కూడా లేని విద్యార్థులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించడంతో విద్యార్థులు బేలముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏ గ్రామానికి వెళ్లినా నిలదీతలు ఎదురవుతుండడంతో రఘునందన్‌రావు అసహనానికి గురవుతున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేకత పెరగడంతో అయోమయానికి గురవుతున్నట్లు తెలిసింది.