అయ్యా రేవంత్రెడ్డి..మీ పాలన ఏడాది దగ్గరకు వస్తున్నది..ఇచ్చిన హామీలు ఏమయ్యాయి…ఏం సాధించారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. దీనికోసం ఎందుకు ఈ కళాజాతలు.. చాలు చాలు ఇక పోండి అంటూ గ్రామాల్లో ప్రజలు తిప్పి పంపుతున్నారు. గురువారం రాత్రి సిద్దిపేట రూరల్ మండలం రావురూకులలో ప్రజలు ప్రజాపాలన విజయోత్సవాలపై ఏర్పాటు చేసిన కళాజాతను పంపించి నిరసన తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా గ్రామాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాలపై కాంగ్రెస్ క్యాడర్ సైతం పెదవి విరుస్తుండడం విశేషం.
సిద్దిపేట, నవంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. కానీ, ప్రజాపాలన విజయోత్సవాలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా జిల్లా మంత్రులు అన్ని జిల్లా కేంద్రాల్లోను, మంత్రుల నియోజకవర్గ కేంద్రాల్లోను కళాజాతలను ప్రారంభించారు. ఈ కళాజాతలు ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నాయి.
ఈ ఏడాదిలో రేవంత్ సర్కార్ ఏం చేసిందని గ్రామాల్లోకి వచ్చిన కళాజాత ప్రదర్శనలను ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేవని, అన్ని చేశామంటూ పాటల రూపంలో వివరిస్తున్నారా..? అంటూ గ్రామాలకు వచ్చిన కళాజాత కళాకారులపై ప్రజలు మండి పడుతున్నారు. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తా అని చెప్పారు. ఎక్కడ చేశారూ చెప్పలంటూ నిలదీస్తున్నారు. రైతులకు పంట రుణమాఫీ కాలేదని, రైతుభరోసా ఇవ్వడం లేదని, మహిళలకు ఇస్తానన్న రూ. 2500 ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. మీరు వచ్చి సీఎం రేవంత్రెడ్డి ఇవి చేసిండు..అవి చేసిండు అంటూ పాటలు పాడుతున్నారా..? అంటు ఆయా గ్రామాల్లో ప్రజలు తిరగబడుతున్నారు.
కాంగ్రెస్ పారీ ఏడాది పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏ ఒక్క వర్గం రేవంత్ రెడ్డి సర్కార్ న్యాయం చేయలేదన్నారు. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తే, కాంగ్రెస్ ప్రభు త్వం దానిని నిర్లక్ష్యం చేసిందని మత్స్యకారులు మండి పడుతున్నారు. గొర్రెల పంపిణీ నిలిచిపోయిందని గొల్లకుర్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు ఇవ్వకుండా ప్రభుత్వం దళితులను అన్యాయం చేస్తున్నదని ఆ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హామీలు అమలు చేయకుండా మోసం చేసి ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవాలు అంటూ మళ్లీ మా ముందుకు వస్తారా అని ప్రజలు మండిపడుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి సంబంధిం చి జిల్లా మంత్రులు తొలిరోజు జెండాలు ఊపడం వర కే పరిమితమయ్యారు. గ్రామాల్లో ప్రజాపాలన విజయోత్సవాలపై విజయవంతంపై శ్రద్ధ పెట్టడం లేదు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం లేదు. సొంత పార్టీ నేతలే విజయోత్సవాలపై పెదవి విరుస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం తప్పా పూర్తిస్థాయిలో ఏం చేశామంటూ వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు.
ఇప్పటికే రెండుసార్లు రైతు బంధుకు ఎగనామం పెడితిమి. పూర్తిగా పంట రుణమాఫీ చేయకపోతిమి.. పింఛన్లు పెంచక పోతిమి..ఏడాదిగా రూపా యి అభివృద్ధి చేయకపోతిమి.. గ్రామాలకు ఏ మొఖం పెట్టుకొని పోతామంటూ ప్రజాపాలన విజయోత్సవాలపై కాంగ్రెస్ శ్రేణులు నిట్టూరుస్తున్నారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ప్రజాపాలన విజయోత్సవాలపై పెద్ధ్దగా శ్రద్ధ చూపడం లేదని సొంత పార్టీ నేతలే పెదవవి విరుస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ మంచి కార్యక్రమం చేసినా దానిని పండుగలా నిర్వహించి ప్రజల్లోకి వెళ్లేవారు. ఇవాళ ఆ పరిస్థితులు లేవని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. ఏడాది కాలంలోనే తమ పార్టీపై బాగా వ్యతిరేకత ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొంటున్నారు.